Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Kashmir assembly elections: కాశ్మీర్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

Kashmir assembly elections: కాశ్మీర్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌ లో మొదటిసారిగా శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ చివరిసారిగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లు కావస్తోంది. గత మంగళవారం నాడు 280 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయడానికి అదే చివరి రోజు. సెప్టెంబర్‌ 18న 24 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగ బోతున్నాయి. బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తుండడం, నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయడానికి వేల సంఖ్యలో ప్రజలు కూడా తరలి రావడం ఎన్నికల పట్ల ప్రజల్లో రోజు రోజుకూ పెరుగుతున్న శ్రద్ధా సక్తులకు అద్దం పడుతోంది. ఈసారి ఒక కొత్త వాతావరణంలో ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. మహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పి.డి.పి) ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించే వరకూ, అంటే 2018 వరకూ ఇక్కడ ప్రజా ప్రభుత్వం కొనసాగింది. కాగా, 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం జరగడంతో ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తారా, లేదా అన్నది అంతుబట్టడం లేదు.
సెప్టెంబర్‌ 30లోగా ఇక్కడ శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు సుప్రీంకోర్టు గడువును నిర్ణయించడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరగడానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడి, ప్రజాస్వామ్య విధానాలు అమలు జరగడం వల్ల రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. నిజానికి 2019 ఆగస్టు నుంచి ఈ ప్రాంతానికి అధి కారాలను తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతం అయినందువల్ల అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా, కాశ్మీర్‌లోని రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వడం, చురుకుగా ఈ ఎన్నికల్లో పాల్గొనడం శుభ సూచకంగా కనిపిస్తోంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు, ప్రాంతీయ పార్టీలైన పి.డి.పి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌.సి)లు ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదార్లుగా ప్రచారాన్ని చేపట్టాయి. కాంగ్రెస్‌ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ ప్రారంభించిన డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కొందరు మాజీ ఉగ్రవాదులు, నిషేధిత సంస్థల సభ్యులతో సహా కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ, ఏ సంస్థాగత ఎన్నికల బహిష్కరణకు పిలుపు నివ్వలేదు.
పార్టీలు మోహరించడం ప్రారంభం అయిపోయింది. ఇండీ కూటమిలో భాగస్వాములైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ పార్టీలు సీట్ల పంపకం విషయంలో ఒప్పందం కుదర్చుకున్నాయి. ఇందులో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 51 స్థానాల్లోనూ, కాంగ్రెస్‌ 32 స్థానాల్లోనూ, సి.పి.ఎం, జమ్మూ కాశ్మీర్‌ పాంథర్స్‌ పార్టీ తలా ఒక స్థానంలోనూ పోటీ చేయడం జరుగుతుంది. అయిదు స్థానాల్లో స్నేహపూర్వక పోటీలు జరుగుతాయి. తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని గతంలో ప్రకటించిన ఎన్‌.సి నాయకుడు ఇప్పుడు తాను గండేర్‌ బల్‌ స్థానం నుంచి పోటీ చేయదలచుకున్నట్టు వెల్లడించారు. బీజేపీ, పి.డి.పిలు ఒంటరిగానే పోటీ చేయదలచుకున్నాయి. బీజేపీ మొదట్లోనే తన మొదటి జాబితాను విడుదల చేసింది కానీ, కొందరు అభ్యర్థుల విషయంలో పార్టీలో కొందరు నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ జాబితాను ఉపసంహరించుకుని కొత్త జాబితాను విడుదల చేసింది. మొత్తం మీద రాష్ట్రంలో అనేక స్థానాల్లో త్రికోణ పోటీలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలు కాశ్మీర్‌ నుంచి జమ్మూకు మారిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌, పార్టీలు, అభ్యర్థులు దీన్ని పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
ఈ ప్రాంతానికి మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడం, శాసనసభకు ఎన్నికలు జరిపించడం వల్ల ఇక్కడ ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టినట్టవుతుంది. అయితే, ఇప్పటికీ ఇక్కడ మధ్య ఉగ్రవాదం, వేర్పాటువాదం తలెత్తుతూ ఉండడం, పలువురు రాజకీయ నాయకులను తప్పనిసరి పరిస్థితుల్లో నిర్బంధంలో ఉంచడం వల్ల ఎన్నికలు నిర్వహించడమే ఒక పెద్ద సమస్యగా, సవాలుగా మారింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పి.డి.పి వంటి పార్టీలు ఇప్పటికీ పాకిస్థాన్‌కే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు తప్ప, జమ్మూ, కాశ్మీర్‌ లను అభివృద్ధి చేయడం మీదా, భారతదేశానికి అనుకూలంగా ఉండడం మీదా శ్రద్ధ చూపించడం లేదు. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న అంశాన్ని ఒక అస్త్రంగా చేసుకుని శాసనసభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని భావిస్తున్న బీజేపీ ఇక్కడి ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ఎన్నికలు నిర్వహిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News