Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: నవతరం కవిత్వం -నల్లమబ్బు పిల్ల

Telugu literature: నవతరం కవిత్వం -నల్లమబ్బు పిల్ల

తెలుగు భాషా దినోత్సవం నాడు నేను చేసిన పని, ఓ నల్లమబ్బు పిల్లతో ఊసులు పంచుకోవడం. సాయి మల్లిక పులగుర్త ఎంతో ఆప్యాయంగా పంపిన హైకూల పుస్తకం చదివిన తరువాత ఈనాటి యువతలో ఇలాంటి సాహిత్యాన్ని ప్రేమించే వాళ్లున్నారన్న సంతోషం ఆపుకోలేక నాలుమాటలుగా స్పందించాలనిపించింది.
అక్షరాల్లో భావాలు పొదగడం, ఇంకా చెప్పాలంటే పదాలకు అనుభూతులు తొడగటం అంత సులభమేం కాదు. ఏ పుస్తకమైనా ముందు ఇటు తిప్పీ అటు తిప్పీ, వెనుక బొమ్మా ముందు బొమ్మా చూసి, ముద్రణా శైలి, ముందు మాటలు వెనుక మాటలు అన్నీ చూసిన తరువాత , పుస్తకంలోకి దూరటం మామూలే గనక ఈ నల్ల మబ్బు పిల్లను కూడా అదే విధంగా చూస్తుంటే, ఆరేళ్ల క్రితం అన్న కృత్యాది సన్నివేశం నన్ను పట్టుకున్నది. కవో కవయిత్రో ఎలా పుడతారు ఒక వ్యక్తి నుండి అనే దానికో చిన్న సంఘటన. ఒక భావసౌదామిని తళుక్కున మెరిసి, అంతర్గత కవిత్వార్ద్ర మేఘాన్ని చైతన్యపరచి , కవితల చినుకులకు నాంది పలికిస్తుంది.
ఆరేసిన బట్టలన్నీ తీసేసిన తర్వాత బోసి పోయిన దండెం ఈ యువతి మనసులో తళుక్కున మెరిసిన కవితా హృదయ స్పందన. అది చాలు ఆ మనసులోని కవితా లత పల్లవించడానికి పచ్చగా ఎదగడానికి , పైపైకి పాకడానికి , రెమ్మల కొసలన్నీ పూవులతో నింపుకోడానికి మల్లిక నల్లమబ్బు పిల్లను అలా దండెం పునాదుల మీదుగా పట్టుకున్నది.
కొంచెం నా గతం తాలూకు అనుభవ మిక్కడ చెప్పాలి. నేను గాలినాసరరెడ్డి గారి పరిచయంతో హైకూల గురించి వినటం జరిగింది. ఆ తరువాత హైకూలు అని కాకుండా మువ్వలు అనే పేరుతో ప్రయత్నం చేసి కొన్ని ఆంధ్రభూమికి పంపడం వాళ్లు వేయటం జరిగింది. అలా రాసిన మువ్వలు పుస్తకం వేసి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింప జేసుకున్నప్పుడు , ఆయన ఒక మువ్వకు బాగా స్పందించడం జరిగింది. అది భాగ్యనగరం పల్లెను ప్రసవించింది.
శిల్పారామం దానికి కారణం ఆ శిల్పారామం అనే పేరు వారి సూచన మీదుగా పెట్టడం. అలా సాయి మల్లిక నల్లమబ్బు పిల్లలో నన్ను నేను వెదుక్కున్నా, ఏదైనా ఫోటో అల్బంలో మన ఫోటో చూసుకోవడానికి ఆత్రపడినట్లు. అలా దండెం నన్ను పట్టుకున్నది గట్టిగా ఎందుకంటే నేను రాసిన దండెం మువ్వ నాకు గుర్తుకు తెచ్చింది మల్లిక.
‘వాకిట్లో దండెం
ముత్యాల దండయ్యింది
వాన వెలిందిప్పుడే’

దృశ్యాలు వేరైనా అనుభూతి పదార్థమొక్కటే. ఏ పాఠకుడైనా ఇతరుల కవితా మధువును తన చషకంలో నింపుకొని గ్రోలుతాడు గనుక. మల్లిక అలాంటి అనేక అనుభూతులను నాలో నెమరు వేయించింది.
ఈ అమ్మాయి రెండు హైకూలు చూడండి
‘చంద్రుడిపై పొగడ్తలకు
అసూయపడి కప్పేసింది
నల్లమబ్బు పిల్ల’
‘అమ్మ చూపించిన
కొబ్బరాకుల ఉయ్యాలపై
ఊగుతోంది కాకిపిల్ల’
ఇవి రెండూ నా మువ్వ
‘చంద్రుణ్ని
కటకటాల్లోకి తోసింది
కొబ్బరాకును’ గుర్తు చేసాయి
వస్తువులు అవే దర్శనాలు వేరు.

ఈ అమ్మాయి హైకూ ఒడుపును పట్టుకుంది. దృశ్యాలన్నింటినీ హైకూ కళ్లతో చూడటం అలవాటు చేసుకుంది. ఒక కంసాలి తనకు వచ్చిన బంగారు పనితో అనేక రకాల నగలు తయారు చేసినట్లు, ఒక బట్టలనేత కాడు అనేక రంగుల్లో, అనేక డిజైన్లతో వస్త్రాలను నేసినట్టు, ఒక రైతు కనకు వచ్చిన విద్యతో అనేక రకాల పంటలు పండించినట్లు సాయి మల్లిక తనకు అలవడిన హైకూ విద్యను అనేక దృశ్యాలకు అన్వయించి తాను ఆనందించి మనల్ని ఆనందింప జేస్తుంది.
వివిధ శీర్షికలతో ఈ పుస్తకంలో హైకూలు మనం నిత్యం చూసే మామూలు విషయాలను భలే అనిపిస్తాయి. చంద్రుడి వానపాటలతో మొదలై, చంద్రుడి వలపులు, స్నేహపు తలపులతో ముందుకు సాగుతూ, పూ’ లయలు, బుజ్జిగాళ్ల సందళ్లు, అప్పటి రోజులు, ఉదయపు సవ్వళ్లను పలుకరిస్తూ , మొబైల్‌ కబుర్లు,అతడి లతలు, ఫోటో చిత్రాలు, క్షణకాల అందాలు అంటూ ఆధునిక జీవన సరిగమల్ని వాయిస్తూ , సంక్రాంతి చలులు, ట్రాఫిక్‌ కళలు, కలికాలపు సంఘటనలు , దీపాల సిరులు , రాండమ్‌ చిగుళ్లు అని అనుభవాలను, అనుభూతులను హైకూకరణం చేసి అందమైన పుస్తకంగా అందిస్తుందీ అమాయకపు అమ్మాయి. అమాయకం అంటే ఏమీ తెలియని అని కాదు ఏ మాయలూ అంటని అని నా ఉద్దేశం . తన హైకూలన్నీ ఆ అరమరికలు లేని అమ్మాయిని, మంచిపై మమకారం పెంచుకున్న అమ్మాయిని మనకు చూపిస్తాయి.
మొదటి పుటలోనే తనను పరిచయం చేసుకుంటూ, నేను మొటిటమొదటిసారి కవిత రాసినప్పుడు, బుల్లి పిల్లి పిల్ల కళ్లలో ఉన్న ఆతృతంత ఆనందం కలిగింది అని తన ఆనందానికి ఒక సాదృశ్యమైన పోలికను వెతుక్కోవడమే ప్రథమ కవితా సోపానం. ఉపమా మల్లికస్య అని అనిపిస్తుంది.
వేపచెట్టు కింద మూగిన
మిత్రుల కిలకిలల ముందు
కోకిల బోసిపోయింది
తాను లోకాన్ని మరిపిస్తాననుకున్న కోయిల

లోకం మరచిన మిత్రుల కిలకిలలను చూసి బోసిపోవడం ఎంత ఉదాత్తం.
కవిత్వమంటే సమాస భూయిష్టమో, శబ్దాలంకార, అర్థాలంకార సమన్వితమో, నిఘంటువులను శోధించి టీకా తాత్పర్యాలను రాసుకుని అర్థం చేసుకునే అగత్యమో, ఈ కవి ఏమి చెప్పదలచుకున్నాడబ్బా అని రేజుల కొలది చదివినమింగుడు పడక బుర్రగోక్కోవల సినదో కాదు, తెలిసిన పదాలతోనే గుండెను స్పృశించే అనుభూతిని అందజేయగలగాలి. కవితోపాటు మనమూ ఆ రసానుభూతిని ఆస్వాదించగలగాలి. అలాంటివి ఇందులో చాలా ఉన్నాయి.
‘సీతాకోకచిలుక రాకకై
ఎదురు చూస్తూ
ఎరుపెక్కింది మందారం’
ఇందులో అర్థం కాని పదాలేమీ లేవు

మందారం ఎరుపెక్కడానికి సీతాకోక చిలకోసం ఎదురు చూపు అన్న భావన కలిగించడమే కవిత్వం. ఈ హైకూ మల్లిక కేవలం మందారాన్ని మాత్రమే చూసి రాసి ఉంటుంది. కానీ నాలాంటి కొంచె పాఠకుడు బాయ్‌ ఫ్రెండ్‌ కోసం ఎదురు చూసే అమ్మాయి ఎంతకూ రాకపోయేసరికి కోపంతో జేవురించిన మొహాన్ని భావించవచ్చు.
ఒకసారి వేలిస్తేఎప్పటికీ
వదలనంత గట్టిగా పట్టుకుంది
నా చెయ్యంతున్న చిన్నిపాప

అక్షరాలతో బొమ్మలు గియ్యడమంటే ఇదే ఈ అమ్మాయి మంచి చిత్రకారిణి కూడా. మధ్య మధ్య పేజీల్లోనే కాకుండా ముఖచిత్రం కూడా తనే గీసుకుంది కవితాత్మకంగా. అదే కళా రహస్యం . చిత్తరువుల్లో భావాలు పొదగడం, భావాల్లో చిత్రాలను చూపడం .
‘తెలిసున్న ప్రపంచం
కొత్తగా పరిచయమైంది
ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అవ్వగానే ‘
వాస్తవమూ , వ్యంగ్యమూ కలిపి చెప్పడం
కవిత్వపు ఒడుపు.
అలాగే
‘వీళ్లిద్దరికీ వినబడదు
ఒకళ్లకి చెవుడు
ఇంకొకరి దగ్గర ఫోనుంది’ వివరణ అక్కర్లేని వ్యంగ్యశరం ఈ హైకూ .
‘రోజంత పచ్చగా ఉండి
ఆలస్యం ఐనప్పుడు మాత్రమే
ఎరుపెక్కిపోయిన సిగ్నల్‌ శత్రువు’

అర్జంటుగా వెళ్లాల్సిన సమయంలో సిగ్నల్‌ పడి ఎంత అసహనాన్ని కలిగిస్తుందో
అనుభవైకవేద్యమే.
కొన్ని ఇబ్బందుల్ని సైతం హైకూగా మలచిందంటే మల్లిక మనసు హైకూ మీద ఎంత లగ్నమైందో అనిపిస్తుంది.
‘వాష్రూంలో కంగారుగా వున్న పిల్లకి
న్యూస్‌ పేపర్లో చుట్టి అందించిన
మంచి స్ట్రేంజర్‌ అక్క’

తన తరాన్ని తనవైపు చూసేట్టు చేసుకుంది మల్లిక కొన్ని హైకూల్లో . అది చాలా అవసరం . అలాగే చిన్న చురకలు కూడా వేసింది.
‘రోడ్డు తక్కువ
బండి అద్దం ఎక్కువ చూస్తున్న
స్టైల్‌ క్రాఫ్‌ కుర్రాడు’
అలాగే,
‘డిజిటల్‌ ప్రపంచానికి
స్వాగతం, ఇక్కడ టైంను
ఎలా వేస్ట్‌ చెయ్యాలో నేర్పిస్తాం’

అక్కడక్కడా కొన్ని తేలిపోయినట్లనిపించి నా, భావాలను దాచుకోలేనితనం తెలుస్తుంది.
పట్టకపోయినా ఫర్వాలేదు
ఎన్నిసార్లయినా మంచితనం
తాళంతెవితోనే తాళం తీస్తాను అనడంలో

మంచి అన్నది పెంచుతామని గురజాడకు హామీ ఇస్తున్నట్లుగా ఉంది .
ఈ తరం వారిలో తెలుగులో మాట్లాడటం, చదవటమే అరుదైన సమయంలో కవిత్వపు జండా చేతబుచ్చుకుని బయలుదేరిన మల్లికకు నా అభినందనలు. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తూ సాఫ్ట్‌గా ఆలోచించే ఈ అమ్మాయి
‘మనందరిలో దాగి ఉన్న ఆ ముద్దైన తుంటరి బుజ్జిగాడికి ‘అంటే ఊరుకో నీయక కలం పట్టి రాయించే మనలోపలి కవిత్వప్రేరణ అనే తుంటరికి పుస్తకాన్ని అర్పించడం కవిత్వం కాలికి గజ్జెకట్టినట్లుగా ఉంది. తెలుగు యువతకు ఈ యువతి స్ఫూర్తిదాయకంగా నిలవాలని , ఇలాంటి నల్లమబ్బు పిల్లలు మరెన్నో మల్లిక నుండి రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • తుమ్మూరి రాంమోహన్‌ రావు
    9701522234
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News