Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Why RSS saying Yes to caste census: కులగణనకు ఆరెస్సెస్ జై కొట్టడంలో...

Why RSS saying Yes to caste census: కులగణనకు ఆరెస్సెస్ జై కొట్టడంలో ఆంతర్యం ఏమిటి ?

కులగణన అంశం కొంతకాలం నుంచి జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ కీలకాంశంపై ఆరెస్సెస్ ఇన్నాళ్లూ మౌనాన్ని ఆశ్రయించింది. కాగా తాజాగా మౌనం వీడింది. వెనుకబడిన తరగతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కులగణన చేపట్టవచ్చని ఆరెస్సెస్ జాతీయస్థాయి ప్రతినిధి సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. బీసీ వర్గాల ప్రయోజనాల కోసం కులగణన సమాచారాన్ని తప్పకుండా ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే కులగణన సమాచారాన్ని ఎన్నికల ప్రచారం కోసం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోరాదని ఆయన స్పష్టం చేశారు. కులగణన నిర్వహించే క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక సమగ్రత దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని నెలల్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జనాభాలో కులాలవారీగా లెక్కలు తీసే బృహత్తర కార్యక్రమానికి ఆరెస్సెస్ ఆమోద ముద్ర వేసిందంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు.

- Advertisement -

కులగణనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జై కొట్టింది. వెనుకబడిన తరగతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కులగణన చేపట్టవచ్చని ఆరెస్సెస్ జాతీయస్థాయి ప్రతినిధి సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. కేరళలోని పాలక్కాడ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి సమన్వయ సమావేశాల్లో కులగణన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయా సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం కులగణన సమాచారాన్ని తప్పకుండా ఉపయోగించుకోవచ్చన్నారు. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన పనిలేదన్నారు. అయితే కులగణన సమాచారాన్ని ఎన్నికల ప్రచారం కోసం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోరాదని సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. కులగణన నిర్వహించే క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక సమగ్రత దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కాగా కులగణన అంశం కొంతకాలం నుంచి జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జాతీయస్థాయిలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర ఇండియా కూటమిలోని అనేక భాగస్వామ్య పక్షాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని నెలల కిందటనే జాతీయస్థాయిలో కులగణనకు కాంగ్రెస్ పార్టీ జై కొట్టింది. కాగా ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కులగణన అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలన్న డిమాండ్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉంటే కులగణన అంశంపై ఆరెస్సెస్ చాలా కాలం పాటు మౌనంగా ఉంది. ఇదొక వివాదాస్పదమైన అంశమన్న ధోరణితో వ్యవహరించింది. అయితే చాలాకాలంగా ఉన్న మౌనాన్ని వీడింది ఆరెస్సెస్. చడీచప్పుడు లేకుండా కులగణన అంశానికి ఆమోద ముద్ర వేసింది. అయితే కులగణనకు ఇంత అకస్మాత్తుగా ఆరెస్సెస్ జై కొట్టడంతో ఇతర రాజకీయ పార్టీల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కులగణనకు అంగీకరించకపోతే దేశ జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతులు దూరం అవుతాయన్న ఆందోళన కూడా ఆరెస్సెస్ లో ఉండి ఉండొచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాగా త్వరలో జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్కండ్, మహారాష్ట్ర లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. గతంతో పోలిస్తే జాతీయస్థాయిలో బీజేపీ పలుకుబడి తగ్గింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ కూడా రాలేదు. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ, జనతాదళ్‌ ( యూ ) సాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా కర్ణాటకకు చెందిన కొంతమంది బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల్లో అనేక అనుమానాలు రేకెత్తించాయి. ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారన్న ప్రచారం ఈ సందర్బంగా ఊపందుకుంది.అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను తొలగించడానికి ఎన్డీయే సర్కార్ ప్రయత్నిస్తుందన్న ప్రచారం జనంలోకి వెళ్లింది. అందుకు ఎన్డీయే కూటమికి 400 సీట్లు అనే మాటను ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే ఉపయోగిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. దీనికంతటికీ కారణం కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలే. మొత్తంమీద ఈ వ్యాఖ్యల ఫలితంగా దేశవ్యాప్తంగా బీసీ వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేశాయన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. కమలం పార్టీకి దుర్భేద్యమైన కోటలాంటి ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ – సమాజ్‌వాదీ పార్టీ కూటమి మెజారిటీ సీట్లు దక్కించుకుంది. బీజేపీ పరాజయానికి ప్రధాన కారణం బీసీ వర్గాలు దూరం కావడమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో బడుగు, బలహీనవర్గాలకు తాము అండగా ఉంటామన్న సంకేతాలు కమలం పార్టీ పంపదలచుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో కులగణనపై ఇన్నాళ్లూ మౌనం దాల్చిన ఆరెస్సెస్ తాజాగా అనుకూల వైఖరి తీసుకుంది. మొత్తంమీద కులగణనతో వెనుకబడిన తరగతులను తమవైపు లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

గతంలో కులగణనకు నో చెప్పిన బీజేపీ
దాదాపు రెండేళ్ల కిందట పార్లమెంటులో వెనుకబడిన తరగతుల జనాభా లెక్కింపు అంశం తెరమీదకు వచ్చినప్పుడు ఇప్ప‌టికిప్పుడు కులాల వారీగా జనాభా ను లెక్కించ‌లేమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. కులగణనకు అప్పట్లో బీజేపీ సర్కార్ నో చెప్పడానికి అనేక రాజ‌కీయ కార‌ణాలున్నాయంటున్నారు సోష‌ల్ సైంటిస్టులు. అప్పట్లో బీజేపీ ముందు చాలా ఒత్తిళ్లున్నాయి. అప్పటికి అయిదారు నెల‌ల్లో దేశంలోనే అతి పెద్ద‌దైన ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు వ్య‌వ‌సాయ బిల్లుల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ శివారులో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌తో బీజేపీకి అప్పటికే త‌ల‌బొప్పి క‌ట్టింది. ఈ నేప‌థ్యంలో అనవసరమైన వివాదాల జోలికి వెళ్ల‌కూడ‌ద‌ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఒక నిర్ణ‌యం తీసుకుంద‌ని ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల క‌థ‌నం. ఉత్తరప్రదేశ్‌లో సిద్ధాంతాల రాద్ధాంతాల కంటే కులాల కుంప‌ట్లే ఎక్కువ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఉత్తర్‌ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఓబీసీల మ‌ద్దతు అవ‌స‌రం.కులాలవారీగా జనాభా లెక్కల సేక‌రిస్తే అది హిందువుల ఓట్లలో చీలిక వస్తుందన్న భయం బీజేపీకి ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. హిందూత్వ అంశంతో మెజారిటీ జనాభాను తనవైపునకు తిప్పుకున్న భారతీయ జనతాపార్టీ, హిందూ ఓటు బ్యాంకు కులాలపరంగా చీలిపోతుందని అప్పట్లో భయపడిందన్నారు రాజ‌కీయ విశ్లేషకులు.

కులాల లెక్కలపై స్పష్టత ఏదీ ?
దేశ జనాభాలో కులాలవారీ లెక్కలపై ఇప్పటివరకు ఒక స్పష్టత అంటూ లేదు. మొత్తం జనాభాలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలు …అంటే ఓబీసీలు 52 శాతం ఉంటారన్న‌ది ఒక అంచ‌నా. వీరికి కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్‌ రంగ సంస్థల ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్‌ కమిషన్ గ‌తంలోనే సిఫార్సు చేసింది. 1931లో చివరిసారిగా జరిగిన కులగణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది. అప్పటి నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయాన్ని కచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్‌ బలంపుంజుకొంది. అయినా 2001,2011 సెన్సస్‌లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీక‌రించలేదు. కులాల‌వారీ జ‌నాభా లెక్క‌లపై స్పష్టత లేకపోవ‌డంతో వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు బాగా న‌ష్ట‌పోతున్నాయంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. వెనుకబడిన తరగతుల జనాభాకు చెందిన లెక్కల వివరాలు తేలకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. బీసీ జనాభా లెక్కలు స్పష్టంగా లేకపోవ‌డం వ‌ల్ల‌నే రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు కొట్టి వేస్తున్నాయి. అంతేకాదు, జనాభా లెక్కలు సమగ్రంగా లేక‌పోవడంతో రిజర్వేషన్లను ఏ మేర‌కు నిర్ణయించాలనే అంశంపై బీసీ కమిషన్లు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇదిలా ఉంటే కులగణనకు రెండు తెలుగు రాష్ట్రాలు జై కొట్టాయి. కాగా తెలంగాణలో కులగణనకు అనుకూలంగా ఈ ఏడాది జనవరి నెలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెద్ద సంఖ్య‌లో ఉన్న వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జ‌ర‌గాల‌న్నా కులాలవారీగా జ‌నాభాను లెక్కించి తీరాల్సిందే అంటున్నారు సామాజిక విశ్లేషకులు.

బీసీ ఛాంపియన్ నితీశ్ కుమార్

కులగణన అనగానే అందరికీ వెంటనే గుర్తుకువచ్చే పేరు నితీశ్ కుమార్. కిందటేడాది అక్టోబరులో కులగణను చేపట్టి దేశవ్యాప్తంగా ఆయన జేజేలు అందుకున్నారు. అందరితో శెహభాష్ అనిపించుకున్నారు. వెనుకబడిన తరగతుల పట్ల నితీశ్ కుమార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేసిన కులగణన సర్వేను తమ స్వంత రాష్ట్రమైన బీహార్‌లో విజయవంతంగా రెండు దశల్లో నితీశ్ కుమార్ పూర్తి చేశారు. బీజేపీ అసాధ్యమనుకున్నదానిని నితీశ్ కుమార్ సుసాధ్యం చేసి చూపించారు. యావత్ భారతదేశానికి బీహార్‌ను ఒక రోల్ మోడల్‌గా ఆయన తీర్చిదిద్దారు. మనదేశంలో ఇప్పటివరకు కులగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం బీహార్. జనాభావారీగా కులాల లెక్కలు తీసి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా బీసీ ఛాంపియన్‌గా పేరు తెచ్చుకున్నారు.

     - ఎస్‌. అబ్దుల్ ఖాలిక్,  సీనియర్ జర్నలిస్ట్  63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News