Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Himanta Biswa unstoppable: హద్దులు మీరుతున్న హిమంత బిశ్వ శర్మ!

Himanta Biswa unstoppable: హద్దులు మీరుతున్న హిమంత బిశ్వ శర్మ!

అస్సాం 15వ ముఖ్యమంత్రి 55 ఏళ్ల హిమంత బిశ్వ శర్మ ప్రస్తుతం హిందుత్వకు ఒక కొత్త ప్రధాన పూజారి అయ్యారు. హిమంత బిశ్వ శర్మ ఈ మధ్య వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన వ్యాఖ్యలను, విమర్శలను, చర్యలను బట్టి చూస్తే ఆయనేదో పెద్ద ప్లానుతోనే ముందుకు వెడుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి, ఆయన లౌకికవాదానికి ప్రధాన సారథిగా పేరు పడిన కాంగ్రెస్‌ పార్టీలో చాలా ఏళ్లపాటు కొనసాగారు. అయితే, ప్రస్తుతం ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి మాత్రం బీజేపీయే కారణంగా మారింది. మతం అనేది సాధారణ ప్రజానీకానికి ఒక మత్తు మందులాంటిదని చెబుతుంటారు. ఇప్పుడది సాధారణ ప్రజలకే కాదు, రాజకీయ పార్టీలన్నిటికీ, రాజకీయ నాయకులందరికీ కూడా మత్తు మందుగా మారినట్టు కనిపిస్తోంది. మతం గురించి మాట్లాడనిదే ఏ నాయకుడికీ ముద్ద దిగుతు న్నట్టుగా లేదు. ప్రస్తుతం ఆ మత్తు మందే మరుగుజ్జు లాంటి నాయకులను సైతం జాతీయ స్థాయి నాయకులుగా మార్చేస్తోంది.
ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా, సుమారు పదేళ్ల పాటు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ను విమర్శించడంలో, లౌకికవాదాన్ని సమర్థించడంలో ముందు వరుసలో ఉండేవారు. అయితే, బీజేపీలో చేరి, అస్సాం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్ట మొదట చేసిన పని గువాహతిలోని ఆరెస్సెస్‌ కార్యాలయాన్ని సందర్శిచడమే. ఇక 2015లో ఆయన బీజేపీలో చేరిన మరుక్షణం నుంచి ఆరెస్సెస్‌ నాయకులు, కార్యకర్తల కంటే ఎక్కువగా కాషాయ దళ సిద్ధాంతాలతో మమేకం చెందడం ప్రారంభించారు. ఆయన తమ ప్రభుత్వ విజయాలు, సాఫల్యాల కంటే మందిరాలు, మౌల్వీలు, ముల్లాలు, మదరసాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారని ఆయన విమర్శకులు వ్యాఖ్యానిస్తుంటారు. తనలోని కలుపుగోరుతనం, సామరస్య ధోరణి తదితర అనుకూలతల కారణంగా ఆయన దాదాపు ప్రతి వర్గానికి చేరువయ్యారు. ఆ కారణంగానే ఆయన 2021 ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టగలిగారు. అస్సాం యువకులు ‘మామా’ అని ప్రేమగా పిలిచే హిమంత్‌ బిశ్వ శర్మ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో హిందు త్వకు మకుటం లేని మహారాజులు చెలామణీ అవుతున్నారంటే ఆయనలోని కలుపుగోరు తనమే అందుకు ప్రధాన కారణం.
విద్వేషాలకు ఆజ్యం
హిందుత్వ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన తీసుకుంటున్న చర్యలను గమనించిన వారికి ఆయన కాంగ్రెస్‌ సంస్కృతి నుంచి పూర్తిగా బయటపడ్డారనే అభిప్రాయమే కలుగు తుంది. గత మూడు దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌ నుంచి భారీ సంఖ్యలో శరణార్థులు అస్సాంలో ప్రవేశిస్తుండడం, క్రమంగా ముస్లింల ఆధిక్యత, ఆధిపత్యం పెరిగిపోతుండడం వగైరా కారణాల వల్ల అస్సాం ప్రజలకు ప్రస్తుతం ఆయన ఒక ఆపద్బాంధవుడిగా, అనాథ రక్షకుడిగా కనిపిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ముస్లింల ప్రభావాన్ని తగ్గించగల నాయకుడు హిమంత బిశ్వ శర్మేనన్న భావన స్థానిక ప్రజల్లో క్రమంగా బలపడుతోంది. ఈ విషయంలో ఆయన పాలనాపరంగానూ, ప్రభుత్వపరంగానూ కొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇదివరకటి ముస్లిం బిల్లులను, చట్టాలను కాదని ఆయన ముస్లింలు తమ పెళ్లిళ్లను తప్పకుండా నమోదు చేసుకోవాలని, విడాకుల గురించి కూడా తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్దేశిస్తూ కొత్త చట్టాలను చేయడం జరిగింది. ఈ చట్టాలు, బిల్లుల ద్వారా ఆయన రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టినట్టు కనిపిస్తోంది.
వారం పది రోజుల క్రితం ఆయన శాసనసభలో ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు ఘాటుగా, సూటిగా, నిర్మొహమాటంగా సమాధానం చెప్పారు. ‘నేను తప్పకుండా పక్షపాతంలోనే వ్యవహరి స్తాను. అస్సాం రాష్ట్రాన్ని మియా ముస్లింలు తమ చేతుల్లోకి తీసుకోవడానికి అవకాశం ఇవ్వను. ఇప్పటికే దిగువ అస్సాంలో సంఖ్యాబలాన్ని పెంచుకుంటున్న మియా ముస్లింలు ఎగువ అస్సాంలో కూడా ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందువుల కంటే వారి జనాభా బాగా పెరుగుతోంది. ఇటువంటివి జరగనివ్వను” అని ఆయన తెగేసి చెప్పి, ప్రతిపక్షాలనే కాకుండా యావత్‌ అస్సాం ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. “రాష్ట్రంలో జనాభాను మార్చడం చాలా అవసరం. ఇది నా బాధ్యత. అస్సాంలో ముస్లిం జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరుకుంది. 1951లో ఇక్కడ ముస్లింల జనాభా 12 శాతం మాత్రమే ఉండేది. ఇప్పటికే అనేక జిల్లాలను పోగొట్టుకున్నాం” అని ఆయన వివరాలతో సహా బయటపెట్టారు.
ఎంత చెబితే అంత!
ఊహించినట్టుగానే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ హిమంత బిశ్వ శర్మ మీద విరు చుకుపడ్డాయి. ఆయన రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ అవి తీవ్రస్థాయి విమర్శలకు దిగాయి. “రాష్ట్రంలోని 18 ప్రతిపక్షాలూ కలిసి ముఖ్యమంత్రి మీద పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాయి. లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలుబడిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి మత కలహాలను రెచ్చగొడుతున్నారు. శాసనసభలో కూడా అతి సున్నితమైన అంశాల మీద తీవ్రస్థాయి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మేం రాష్ట్రపతికి కూడా లేఖ రాయబోతున్నాం” అని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు భూపేన్‌ కుమార్‌ బోరా ప్రకటించారు. ప్రతిపక్ష నాయకులంతా కలిసి ఆ మరునాడు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి, ముఖ్యమంత్రితో రాజీనామా చేయించాలని పట్టుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ కూడా ఈ వ్యవహారం మీద మాట్లాడుతూ, “అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, చర్యలు ఆమోదయోగ్యం కావు. వీటిని ప్రతివారూ ఖండించా ల్సిందే. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, తీవ్రస్థాయి వ్యాఖ్యలు, విమర్శలు చేయడం వల్ల వాతావరణం విషపూరితం అవుతోంది” అని వ్యాఖ్యానించారు. బిశ్వ శర్మ కూడా వీటిని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “మీకు కావాలంటే అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం ప్రయత్నిం చండి. నేను ఈ పోటీలో పాల్గొనబోవడం లేదు” అని ఆయన అన్నారు.
హిందూ మతానికి అనుగుణంగా మాట్లాడడానికి, ఇస్లామిస్టులను, ప్రత్యర్థులను విమర్శించడానికి ఆయన ఏ చిన్న అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. ఆయన గత ఏడాది కూడా ముస్లిం జనాభా గురించి తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముస్లింల జనాభా పదేళ్లకు 30 శాతం చొప్పున పెరుగుతుండగా, హిందువుల జనాభా కేవలం 16 శాతం మాత్రమే పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “2041 నాటికి రాష్ట్రంలో ముస్లింల జనాభా హిందువుల జనాభాను మించి పోతుంది. ఇది తప్పకుండా నిజం కాబోతోంది. దీనినెవరూ ఆపలేరు” అని ఆయన హెచ్చరించడం జరిగింది. మత మౌఢ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయనే కారణంతో ఆయన చాలా కాలంగా మదరసాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మదరసాలనన్నిటినీ మూసేయించారు. ప్రైవేట్‌ మదరసాలకు రాజ్యాంగ భద్రత ఉన్నందువల్ల ఆయన వాటిని 3,000 నుంచి 2,000లకు తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయమై అధికారులతో చర్చించడంతో పాటు, ప్రైవేట్‌ మదరసాల నిర్వాహకులతో కూడా చర్చలు జరుపుతున్నారు.
మారుతున్న సమీకరణాలు
ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నందువల్ల ఆయనకు ఇతర పార్టీల వెన్ను ఎలా విరవాలో తెలుసు. ప్రస్తుతం అస్సాంలో ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో ఉన్నాయి. అమిత్‌ షా ప్రోత్సాహం, ప్రోద్బ లంతో బీజేపీలో చేరిన శర్మ అతి త్వరలోనే నరేంద్ర మోదీ అభిమానాన్ని కూడా చూరగొన్నారు. ఆయన అమిత్‌ షా మీద వచ్చిన ‘అమిత్‌ షా అ్‌ండ మార్చ్‌ ఆఫ్‌ బీజేపీ’ అనే పుస్తకాన్ని స్వయంగా అస్సామీస్‌ భాషలోకి అనువదించారు. ఇప్పుడు ఆయన ఆరెస్సెస్‌ అగ్ర నాయకత్వా నికి కూడా సన్నిహితులయ్యారు. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులన, కాంగ్రెస్‌ అనుకూల శక్తులను ఏరివేయడంలో ఆయన క్రమంగా కృతకృత్యులవుతున్నారు.
త్రిపురలో బీజేపీ ఘన విజయం సాధించడానికి ఆయనే ప్రధాన కారణం. మణిపూర్‌, మేఘాలయ, నాగాలా్‌ండ అరుణాచల్‌ ప్రదేశ్‌ లలో ఆయన బీజేపీ ప్రాబల్యాన్ని బాగా పెంచారు. ప్రస్తుతం జార్ఖండ్లో బీజేపీ గెలుపు బాధ్యతను కూడా ఆయన స్వీకరించారు. ఆయన ఎన్నికల ప్రచారాల్లో “కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయడమంటే బాబర్లను గెలిపించడమే. ఔరంగ జేబులకు విటమిన్లు ఇవ్వడమే. ఆ పార్టీని గెలిపిస్తే దేశవ్యాప్తంగా హిందువుల మీద బాబర్లు, ఔరంగజేబులు దాడులు చేయడం ప్రారంభిస్తారు. దేశాన్ని కొల్లగొట్టడం ప్రారంభిస్తారు” అని పదే పదే చెబుతున్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వం కుప్పకూలినప్పుడు శివసేన పార్టీలోని తిరుగుబాటుదార్లను సురక్షితంగా అస్సాంలో ఉంచి, ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన వ్యక్తి హిమంత బిశ్వ శర్మే. తాను నమ్మిన సిద్ధాంతాలకు మొండిగా కట్టుబడి ఉండడం, అందరికీ అందుబాటులో ఉండడం, ఆచరణాత్మక రాజకీయాలను అనుసరించడం, సమర్థంగా పాలనను నిర్వహించడం వెరసి హిమంత బిశ్వ శర్మ అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆయన విషయంలో న్యాయస్థానాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో తెలి యదు కానీ, ఆయన మాత్రం భావి హిందూ హృదయ సామ్రాట్‌ గా గుర్తింపు పొందుతున్నారు.

  • ఎ.వి.వి. సత్యనారాయణ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News