Wednesday, October 30, 2024
Homeఫీచర్స్Live in: అమ్మాయిలూ..సహజీవనంలో ఉన్నారా?

Live in: అమ్మాయిలూ..సహజీవనంలో ఉన్నారా?

స్త్రీపురుషుల రిలేషన్షిప్స్ లో నేడు మన సమాజంలో సరికొత్త పోకడలు కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండుతో లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం ఒకటి. ఈ ధోరణి నేటి యువతీయువకులు చాలామందిలో కనిపిస్తోంది. అంతేకాదు యువతుల్లో డేటింగ్ కల్చర్ కూడా బాగా పెరుగుతోంది. డేటింగ్ చేస్తున్న వ్యక్తి తమకు పూర్తిగా నచ్చితేనే వారిని జీవిత భాగస్వాములుగా చేసుకోవడానికి లేదా పెళ్లితో సంబంధం లేకుండా వారితో కలిసి జీవించడానికి ఆధునిక యువతులు ప్రాధాన్యం ఇస్తున్న పోకడలూ చూస్తున్నాం.

- Advertisement -

వివాహం జీవితంలో ఒక భాగమే తప్ప అదే జీవితం కాదన్న అభిప్రాయాలు నేటి తరం అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎక్కువవడం ఈ రకమైన ఆలోచనా ధోరణికి ఒక ప్రధాన కారణం. పైగా సంప్రదాయబద్ధమైన వైవాహిక జీవితాల పట్ల, జీవనశైలి పట్ల నేటి తరం యువతలో నిర్దిష్టమైన నిర్ణయాలు, అభిప్రాయాలు ఉంటున్నాయి. సో ఆ రకమైన పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులను వ్యతిరేకించడానికి కూడా యువతీయువకులు సిద్ధపడుతున్నారు. ఇంతవరకూ పాశ్చాత్య దేశాల్లో చూస్తున్న ఈ రకమైన జీవనశైలి ఇపుడు మనదేశంలోనూ బాగా ఎక్కువైంది. లివ్-ఇన్ రిలేషన్షిప్ కల్చర్ ఇక్కడ యువతలోనూ బాగా పెరుగుతోంది. అదే సమయంలో దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల తమ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఇలాంటి లివ్-ఇన్ రిలేషన్ షిప్స్ లోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్న భయాందోళనలు తల్లిదండ్రుల్లో కనిపిస్తున్నాయి.

ఇటీవల నిక్కి యాదవ్, శ్రద్ధా వాకర్ అనే ఇద్దరు యువతులు ఇలాంటి లివ్-ఇన్ రిలేషన్ షిప్స్ లో ఉండి బాయ్ ఫ్రెండు చేతుల్లో భయంకరంగా హత్యకు గురవడం తీవ్ర సంచలనం స్రుష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లివ్-ఇన్ రిలేషన్షిప్స్ లోకి దిగాలనుకుంటున్న యువతులు తమ బాయ్ ఫ్రెండ్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు అడుగువేస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తమకు నచ్చిన అబ్బాయితో లివ్-ఇన్ రిలేషన్షిప్ కొనసాగించాలనుకుంటున్న అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి వారో, వారి నిజస్వరూపాలు ఏమిటో తెలుసుకోకుండా ముందుకు అడుగువేస్తే ప్రమాదమేనని గ్రహించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఎందరో తామెంతో నమ్మిన తమ బాయ్ ఫ్రెండ్స్ చేతుల్లో ప్రాణాలను కోల్పోయిన ఘటనలు ఎక్కువవడం చూస్తున్నాం. దీంతో ఈ రిలేషన్ షిప్ లోకి ప్రవేశించిన మహిళల రక్షణ గురించిన ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితులను కొనితెచ్చుకోకుండా అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లివ్- ఇన్ రిలేషన్షిప్ లోకి వెళ్లాలనుకుంటున్న అమ్మాయిలు తాము కలిసి ఉంటున్న బాయ్ ఫ్రెండు గురించి అన్ని విషయాలు బాగా తెలుసుకుని కానీ ముందుకు అడుగువేయకూడదని రిలేషన్షిప్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సాహిల్ గెహ్లాట్ అనే యువకుడు తన లివ్-ఇన్ పార్టనర్ అయిన 23 ఏళ్ల నిక్కి యాదవ్ ను ఛార్జర్ తో గొంతుపిసికి హత్య చేసి అదే రోజున ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయిన విషయం వార్తల్లో చూశాం. ఈ సంఘటనను ఉద్దేశించి స్పందిస్తూ లివ్-ఇన్ రిలేషన్షిప్స్ లో మహిళల జీవితాలకి రక్షణ లేకుండా పోతోందని ఇటీవల నేషనల్ విమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించండం కూడా మర్చిపోలేము. లివ్-ఇన్ రిలేషన్షప్స్ లో ఉంటున్న మేజర్ అయిన యువతులు తమకు నచ్చిన వ్యక్తితో జీవించడం తప్పుకాదు కానీ తమ ప్రాణాల రక్షణ విషయంలో కూడా వాళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ స్పష్టంచేస్తున్నాయి. లివ్-ఇన్ రిలేషన్షిప్స్ లో ఉండే అమ్మాయిలు ఎప్పుడూ తమ కుటుంబంతో సంబంధాలను కొనసాగించడం చాలా మంచిది.

తల్లిదండ్రులు ఇందుకు ముందుకురాకపోతే తమ ఆత్మీయులో, స్నేహితులో తమకు అండగా ఉండేలా అమ్మాయిలు చూసుకోవాలి. అయిన వాళ్లు అందించే ఈ రకమైన మద్దతు వల్ల అమ్మాయిలకు కాస్త రక్షణ ఉంటుంది. అలాగే తాము లివ్-ఇన్ రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్న బాయ్ ఫ్రెండు స్వభావం, ప్రవర్తన సరిగా లేకపోతే అతన్ని భరిస్తూ, అతని మాటలు నమ్ముతూ ఉండకుండా వెంటనే దూరం పెట్టడం ఆమెకు మంచిది. తన బాయ్ ఫ్రెండులోని హింసాత్మక ప్రవ్రుత్తి గుర్తించిన వెంటనే ఆత్మీయులు లేదా స్నేహితులు లేదా కుటుంబసభ్యులకు ఆ విషయం వెంటనే తెలియజేయాలి. మీ బాయ్ ఫ్రెండ్ ఇంకా ఆపకుండా తరచూ మీపట్ల అదే రీతిలో హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటే ఆ రిలేషన్ షిప్ నుంచి వీలైనంత వేగంగా వైదొలగడం మంచిది. అలాగే ఈ రకమైన రిలేషన్షిప్ లో ఉంటున్న యువతులు ఆత్మరక్షణ పరంగా కూడా ముందుజాగ్రత్తలతో ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలి.

ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి గన్ను, ఇనుపగొలుసు, మిరియాలపొడి లాంటివాటిని ఎప్పుడూ దగ్గరపెట్టుకోవాలి. అలాగే బాయ్ ఫ్రెండుతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న అమ్మాయిలు ఇరుగుపొరుగు వారితో స్నేహంగా ఉండడం కూడా ఎంతో అవసరం. అలా వారితో కలిసిపోయి మెలగడం వల్ల అమ్మాయిల రిలేషన్ షిప్ ప్రమాదంలో పడినపుడు, వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినపుడు ఆ పొరుగువారే వారికి అండగా నిలబడే అవకాశం ఉంది. ఇలాంటి అమ్మాయిలు సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్లే అండగా నిలబడతారు. ఈ రిలేషన్ షిప్ లో మీ బాయ్ ఫ్రెండు నుంచే మీ ప్రాణాలకు ముప్పు ఎదురయే పరిస్థితి ఎదురైనపుడు అందులోంచి బయటపడటానికి 112 ఎస్ వొ ఎస్ మొబైల్ యాప్ ఉంది. ఇది ఇలాంటి మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రమాదంలో చిక్కుకున్న ఈ మహిళలను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఎమర్జన్సీ రెస్పాన్స్ సపోర్టు సిస్టమ్ (ఇఆర్ ఎస్ ఎస్) ఇది. ఈ యాప్ మనదేశంలోని చాలా రాష్ట్రాలలో అందుబాటులో ఉంది. తమ పార్టనర్ వల్ల ప్రమాదంలో పడ్డ ఇలాంటి మహిళల ప్రాణాలను ఇఆర్ ఎస్ ఎస్ వ్యవస్థ వెంటనే కాపాడుతుంది. అందుకే లివ్- ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్న అమ్మాయిలూ… మీ జీవితాలు సంతోషంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు కానీ మీరు కలిసి జీవిస్తున్న మీ బాయ్ ఫ్రెండు వల్లే మీ జీవితం ప్రమాదంలో పడితే మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడానికి ముందొస్తుగా సురక్షిత చర్యలతో సిద్ధంగా ఉండడం కూడా ఎంతో అవసరమని మరవొద్దు. ఆ విషయాన్నినిర్లక్ష్యం చేయొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News