Chandrababu-Modi: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలుస్తున్నారంటే ఏపీ రాజకీయాల్లో అది చర్చనీయాంశమైన విషయమే. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంలో కేంద్రంలోని బీజేపీ పెద్దల పాత్ర చాలాకీలకం అనేది అందరికీ తెలిసిన విషయం. ఏపీకి ప్రత్యేక హోదాకోసం చంద్రబాబు కేంద్రంపై యుద్ధంచేస్తే.. కేంద్రం పెద్దలు చంద్రబాబు టీంపై ఐటీదాడులు, జగన్‌కు లోపాయికారిగా అండగా నిలబడి చంద్రబాబు ఓటమికి కారణమయ్యారు. అప్పటి నుంచి చంద్రబాబు, ప్రధాని మోదీ కలిసింది ఒకటిరెండు సార్లు మించి ఎక్కువ ఉండదు. గతంలో మోదీతో చంద్రబాబు ఎన్నిసార్లు భేటీ అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలకు నాంది అవుతుందనడంలో అతిశకయోక్తి లేదు.
ఇంతకీ.. చంద్రబాబు నిజంగానే మోదీని కలుస్తున్నాడా అనే విషయానికి వస్తే.. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు జీ-20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. భారత్‌లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి.. సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. అలాగే సమావేశ ప్రాధాన్యతను కూడా టీడీపీ అధినేతకు ప్రహ్లాద్ జోషి ఫోన్‌లో వివరించి హాజరు కావాల్సిందిగా కోరారట.
కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం పలకడంతో టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పనిలోపనిగా ప్రధాని మోదీతోనూ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉందంటూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఆ వార్తలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేస్తున్నాయి. చంద్రబాబు గతంలో బీజేపీని గద్దెదింపేందుకు కంకణం కట్టుకొని కాంగ్రెస్‌కు మద్దతు పలికాడు. బొక్కాబోర్లా పడటంతో జగన్ అధికారంలోకి వచ్చి ఆ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నాడు. జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే కేంద్రంలో బీజేపీ అండకూడా అవసరమని చంద్రబాబు భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే మోదీతో భేటీకి చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారు. అయితే, బిజీబిజీ షెడ్యూల్ లో చంద్రబాబును కలిసేందుకు మోదీ ఎంత వరకు సమయం ఇస్తాడనేదికూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంతో ఏపీలో ఎన్నికల వాతావరణం తలపిస్తుండగా.. ప్రస్తుతం మోదీతో చంద్రబాబు భేటీ అనే వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.