Monday, November 25, 2024
Homeహెల్త్Ever youth: నిత్యయవ్వనులుగా ఉంచే గాడిదపాలు

Ever youth: నిత్యయవ్వనులుగా ఉంచే గాడిదపాలు

అందం అనగానే చాలామంది మనసుల్లో ఈజిప్టు బ్యూటీ క్వీన్ క్లియోపాత్ర పేరు చటుక్కున గుర్తుకువస్తుంది. తన చర్మం కాంతివంతంగా, ఆకర్షణీయంగా ఉండడానికి ఆమె నిత్యం గాడిదపాలను ఉపయోగించేదని పేరు. అంతేకాదు స్కిన్ కేర్ ట్రీట్మెంట్ గా గాడిదపాలతో స్నానం చేసేదని కూడా ప్రసిద్ధిపొందింది ఆమె. అందుకే ఇప్పటికీ ఈజిప్షియన్ మహిళలు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కు, చర్మం పట్టులా మెరవడానికి గాడిదపాలను వాడుతుంటారని ప్రతీతి. గాడిదపాలలోని ఈ బ్యూటీ సీక్రెట్ల నిజానిజాలు మనలో ఒకవైపు ఉత్సుకతను రేపుతుంటే, దీనికి సంబంధించే మరొక ఆసక్తికర విషయం కూడా ఉంది. గాడిదపాలలో పోషకాల సాంద్రత ఎంతో ఎక్కువ. అందుకే తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా గాడిదపాల వైపు ఎందరో చూస్తున్నారు.

- Advertisement -

ఆవుపాలలో కన్నా గాడిదపాలలో నాలుగు రెట్లు ఎక్కువ పరిమాణంలో సి విటమిన్ ఉందిట. అంతేకాదు విటమిన్ ఇ, అమినో యాసిడ్స్, విటమిన్ బి1, బి6, సి, డి, ఇ, ఒమేగా 3 మరియు 6 కూడా గాడిద పాలల్లో ఉన్నాయి. గాడిదపాలల్లో కాల్షియం బాగా ఉంది. అంతేకాదు రెటినాల్ అనే పదార్థం కూడా ఉంది. ఇది చర్మాన్ని నిత్యయవ్వనంగా ఉంచుతుందిట. అందుకే కాస్మొటిక్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్న పలు పదార్థాల్లో గాడిదపాల వినియోగం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. వైద్యశాస్త్ర పితామహుడిగా పేరున్న గ్రీకు ఫిజీషియన్ హిప్పోక్రాట్స్ కూడా రకరకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి గాడిదపాల వాడకాన్ని సూచించేవారట.

గాడిద పాలల్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి మనుషుల చర్మాన్ని యవ్వన కాంతితో మెరిసేలా చేస్తూ వయసును కనిపించకుండా చేయడమే కాకుండా చర్మానికి మంచి సాంత్వన నిచ్చే గుణం కూడా ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లో ఉన్నాయిట. చర్మంపై ఏర్పడ్డ ఫైన్ లైన్స్ ను ఇవి పోగొట్టడమే కాదు దెబ్బతిన్న చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తాయి కూడా. గాడిదపాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల చర్మ సంబంధమైన సమస్యలు కూడా తగ్గుతాయిట. గాడిదపాలలోని న్యూట్రియంట్లు, యాంటాక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ లక్షణాలను వ్రుద్ధిచేస్తాయి. వీటిల్లోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్మరస్, విటమిన్స్, అమినో యాసిడ్స్ వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.

భారతదేశంలో, ఆఫ్రికా లాంటి చోట్ల శతాబ్దాలకు పూర్వమే చర్మ సమస్యలకుసంబంధించిన మందుల తయారీలో కూడా గాడిదపాలను వాడేవారని తెలుస్తోంది. గాడిదపాలల్లోని లాక్టిక్ యాసిడ్ కి చర్మాన్ని ఎక్స్ఫొయిలేట్ ద్వారా శుభ్రం చేసే సుగుణం ఉంది. పైగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా గాడిదపాల్లో ఉన్నాయి. గాడిదపాలల్లోని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ యాక్నే ప్రోన్ అయిన చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. తరచుగా చర్మానికి గాడిద పాలు రాసుకోవడం వల్ల స్కిన్ యవ్వనంగా , ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.

ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడవు. గాడిదపాలల్లో చర్మాన్ని మ్రుదువుగా చేసే, చర్మానికి తేమను అందించే సుగుణాలు కూడా చాలా ఉన్నాయి. గాడిదపాలు మంచి క్లీన్సర్ గా కూడా పనిచేస్తాయి. చర్మంపై పేరుకున్న మురికి, మట్టిలను తొలగించి చర్మ సహజ మెరుపు దెబ్బతినకుండా గాడిదపాలు సంరక్షిస్తాయి. చర్మం పొడారినట్టు, సాగినట్టు అయినా, ముడతలు పడినా వాటిని తగ్గించడంలో గాడిదపాలు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. వయసు కనిపించకుండా మనల్ని నవయవ్వనంగా కనిపించేలా కూడా ఈ పాలు చేస్తాయి. సూర్యరశ్మి బారిన ఎక్కువ పడడం వల్ల కూడా చర్మంపై ముడతలు, గీతలు పడి వయసు మీదపడినట్టు కనిపిస్తాం. గాడిదపాలలోని రకరకాల విటమిన్లు, మినరల్స్ సూర్యరశ్మి దుష్ఫలితాలు చర్మంపై పడకుండా కాపాడతాయి.

యాక్నే, ఎగ్జిమా, ఇతర చర్మ రోగాలు తలెత్తకుండా అడ్డుకోవడం ద్వారా యవ్వనంగా కనిపించేలా గాడిదపాలు మనల్ని సంరక్షిస్తాయి. గాడిదపాలల్లో సహజసిద్ధమైన హైడ్రైన్ట్ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ పాలు డీహైడ్రేషన్ తలెత్తకుండా మనల్ని కాపాడతాయి. చర్మం బాగా హైడ్రేటెడ్ గా ఉంటే బ్యూటీ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రిములు, మాయిశ్చరైజర్ ఉత్పత్తుల వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభవాలు మనలో తలెత్తవు. అంతేకాదు బాగా హైడ్రేటెడ్ గా ఉన్న స్కిన్ నిత్యయవ్వనంతో బాగా మెరుస్తూ ఉంటుంది. చర్మ కణాలు దెబ్బతినడం వల్ల కూడా మనం వయసు మీదపడినవారిలా కనిపిస్తాం. గాడిదపాలల్లోని పోషకాల వల్ల చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ పాలల్లోని న్యూట్రియంట్లు చర్మ కణాలను పునరుద్ధరిస్తాయి కూడా. గాడిదపాలల్లోని రెటినాల్ యాంటి ఏజింగ్ పదార్థంగా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఆర్గానిక్ ఉత్పత్తులలో గాడిదపాలను కూడా చేర్చి చేసిన ఆర్గానిక్ సోప్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిత్యం వాడడం వల్ల ప్రిమెచ్యూర్ ఏజింగ్ బారిన పడము. చర్మం యవ్వన మెరుపును కోల్పోదు కూడా. ఇన్ని సౌందర్య రహస్యాలున్న గాడిదపాలు అందం, ఆరోగ్యాల పరిరక్షణకు సంజీవనీ కాదంటారా…?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News