విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, సాగునీటి రంగం, పారిశ్రామిక అభివృద్ధి, అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగం వంటి ప్రాధాన్యత రంగాలలో ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు.
అనంతరం ప్రజలనుద్దేశించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందజేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సాహిత్య ఉద్యమంలో, తెలంగాణ ప్రాంతం రాజుల పాలన నుంచి విముక్తికి చేసిన ఉద్యమంలో ఖమ్మం జిల్లా కీలకపాత్ర పోషించిందని అన్నారు.
సాహిత్యం, సాంస్కృతిక ఉద్యమానికి బీజాలు వేసిన, ఆది శ్రీకృష్ణ దేవరాయ స్ఫూర్తితో వచ్చిన గ్రంథాలయ ఉద్యమం, మూడవ ఆంధ్ర మహాసభలు ఖమ్మం, మధిర ప్రాంతాలలో జరిగాయని, అల్లీ నగర్ ప్రాంతానికి చెందిన మహనీయుడు ఒట్టి కొండ రామా కోటయ్య బాల్యం నుంచి నాటి జాతీయ ఉద్యమాల స్ఫూర్తితో ప్రజా పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు.
ముదిగొండ, గోకినేపల్లి, వెంకటాయపాలెం, మధిర, తెల్దారుపల్లి, ఎర్రుపాలెం, రావినూతల, గోవిందాపురం మొదలగు ప్రాంతాలు నిత్య పోరాట క్షేత్రాలుగా ఉన్నాయని, బొమ్మ కంటి సత్యనారాయణ, రావెల్ల సత్యం, రావెల్ల వెంకటరామారావు లాంటి ఎందరో మహనీయులు సాయుధ పోరాటంలో భాగం అయ్యారన్నారు. తెలంగాణ ఏర్పాటు చారిత్రక అనివార్యంగా మేధావులు భావించారని, తెలంగాణ సాహిత్య ఉద్యమానికి డాక్టర్ సి.నారాయణరెడ్డి, దాశరధి కృష్ణమాచారి వంటి ఎందరో రచయితలు తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసి పట్టణాలు, గ్రామాలలో పర్యటించిన నాలుగు సంవత్సరాల పాటు ఉద్యమ స్ఫూర్తి రగిలించారని అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన విరోచిత పోరాటాల ఫలితంగా మన ప్రాంతం రాజుల పాలన నుండి ప్రజాస్వామ్య భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనం కావడం జరిగిందని, దీనిని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్యారంటీ పథకాల అమలుకు ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రారంభించిన మహాలక్ష్మి పథకం క్రింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం, మన జిల్లాలో ఇప్పటి వరకు కోటి 79 లక్షలకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశామని, దీని ద్వారా మహిళలు దాదాపు 84 కోట్ల 32 లక్షల రూపాయలు ఆదా చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం క్రింద జిల్లాలో 3 లక్షల 94 వేల 753 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై సరఫరా చేసి సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో 11 కోట్ల 19 లక్షల సబ్సిడీ సొమ్ము జమ చేయడం జరిగిందని అన్నారు.గృహజ్యోతి పథకంతో పేదల ఇంటిలో వెలుగు నింపామని, గృహ జ్యోతి ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 57 వేల 995 వినియోగదారులకు ప్రతి నెలా జీరో బిల్లులు జారీ చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం 49 కోట్ల 97 లక్షల సబ్సిడీ చెల్లించడం జరిగిందని తెలిపారు.
నిరుపేదలు సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యం పొందాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచిందని, ఖమ్మం జిల్లాలో మొత్తం 10 వేల 876 మంది పేదలు ఆరోగ్యశ్రీని వినియోగించుకుని చికిత్స పొందారని, ఇందుకుగాను ప్రభుత్వం 22 కోట్ల 90 లక్షలు ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేశామని, జిల్లాలోని 1,15,180 మంది రైతుల రుణ ఖాతాలకు సంబంధించి 766 కోట్ల 66 లక్షల పైగా రుణమాఫీ చేయడం జరిగిందని, అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రైతు భరోసా పథకాన్ని అర్హులైన రైతులకు వర్తింపజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, భూమి లేని రైతు కూలీల కుటుంబాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. సన్న వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించిందని, పంటల బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచి వర్తింపజేసే దిశగా, రైతు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకం క్రింద జిల్లాలో ఆయకట్టుకు సాగునీరు అందించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో అన్ని రంగాల వారికి నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, 2030 నాటికి విద్యుత్ డిమాండ్ ను అంచనా వేస్తూ ఉత్పత్తి పెరిగే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద గ్రామాలలోని రైతులకు పూర్తిస్థాయిలో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు.
ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ నియామకాలు పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని, ప్రైవేటులో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించేందుకు వారి నైపుణ్యాలు పెంపొందించే దిశగా స్కిల్ యూనివర్సిటీ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 63 ఐటీఐ కేంద్రాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు .
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందజేసేందుకు నైపుణ్య కేంద్రాలలో పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేశామని, క్యాంపస్ దశలోనే విద్యార్థులకు ఉద్యోగం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
విద్యా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా విద్యా కమిషన్ ను ప్రభుత్వం నియమించిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, అంగన్వాడి కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్లో మార్చుతున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ విద్యార్థుల కోసం సమీకృత మోడల్ స్కూల్స్ నిర్మించబోతున్నామని,
ప్రస్తుత సంవత్సరం 120 కోట్లు పైగా ఖర్చు చేసి దాదాపు 50 నుంచి 60 సమీకృత మోడల్ స్కూల్స్ ప్రారంభించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పటిష్టంగా శాంతిభద్రతలు నిర్వాహణకు చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ వాడకంపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు.
దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఖమ్మంలో మున్నెరు నదీ 40 అడుగులకు పైగా ఉధృతంగా ప్రవహించి వరదలతో ముంచేత్తిందని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు కాపాడుతూ సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేయడంలో జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారు. వరదల వల్ల ఇల్లు దెబ్బ తిన్న 15 వేల 96 కుటుంబాలకు 16 వేల 500 రూపాయల చొప్పున పంపిణీ చేశామని, పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయల పరిహారం, ఆస్తి, పశు నష్టం జరిగిన వాటికి పరిహారాన్ని అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రజలకు సందేశాన్ని ఇచ్చిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు.
జిల్లా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఎన్ .పి.డి. సి.ఎల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ లను సందర్శించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి గ్యాస్ సిలెండర్ లబ్ధిదారులకు అలాట్మెంట్ కాపీలను అందజేశారు.
అనంతరం మెప్మా , డ్వాక్రా మహిళలు కూర్చున్న చోటికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రూరల్ ప్రాంతాల్లో మహిళా సంఘాలు తయారు చేసిన పరికరాలను పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు మార్కెటింగ్ చేయాలని, కొత్త, కొత్త వినూత్న ఆలోచనలతో ఆదాయం పెంపొందించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.