పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని 5 రూపాయలకే మూడు పూటలా అందిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి.భరత్ తెలిపారు.
కలెక్టరేట్ వద్ద, స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద కొండారెడ్డి బురుజు సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి. భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. కర్నూలు నియోజకవర్గంలో పేదలకు అవసరమైన ప్రదేశాలలో 3 అన్న క్యాంటీన్ లు ఏర్పాటు చేశామని, ఇందులో 2 అన్న క్యాంటీన్ లను ఈ రోజు ప్రారంభించామని తెలిపారు.. త్వరలో స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మరొక అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తామన్నారు. పేద ప్రజల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్ ల ద్వారా కేవలం 5 రూపాయలకే నాణ్యతతో కూడిన అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందచేస్తోందన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ లను తీసివేయడంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ప్రజలకు మేలు చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వమని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధించేందుకు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
కర్నూలు నగరంలో 5 అన్న క్యాంటీన్లు: కలెక్టర్
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో 5 అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు 4 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. కల్లూరు పరిధిలోని పరిమళ నగర్, సెట్కూర్ కార్యాలయం వద్ద, కలెక్టరేట్ ఆవరణలో, పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు సమీపంలో మొత్తం 4 క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు..అవసరమైన పనుల కోసం నగరానికి వచ్చే పేదలకు అన్న క్యాంటీన్ ల ద్వారా 5 రూపాయలకే ఆహారం అందించడం వల్ల ఆకలి తీరడంతో పాటు డబ్బు ఆదా అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
తొలుత అన్న క్యాంటీన్ లను ప్రారంభించిన అనంతరం మంత్రి, కలెక్టర్ స్వయంగా ప్రజలకు అల్పాహారాన్ని వడ్డించడంతో పాటు వారితో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు, తదితరులు పాల్గొన్నారు.