తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో దేశానికి తలమానికంగా ఉందని 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్న తరుణంలో చినుకు పడితే చాలు చీకటి మయంగా మారుతున్న గ్రామాలు సైతం ఉన్నాయనడంలో అతిశయోక్తి కాదు.
చినుకు పడితే చాలు మా గ్రామం అంతా కారు చీకట్లోనే ఉంటుందని చుక్కాపూర్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిస్తే రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తుంటే చుక్కాపూర్ గ్రామ ప్రజల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామస్థులు విద్యుత్ సమస్య వలన మంగళవారం స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి చేసి దర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చినుకు పడితే చాలు మా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామమంతా చీకట్లు అలుముకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన మా గ్రామంలోని విద్యుత్ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదనీ దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారనీ పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యుత్ సమస్యతో సతమతమవుతున్నామని అధికారులు మాత్రం ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదనీ చుక్కాపూర్ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తేలికపాటి వర్షాలు పడ్డా, గాలి దుమారం వచ్చినా మా గ్రామమంతా తెల్లారే వరకు అంధకారంలో మగ్గాల్సిందేననీ, అసలే వర్షాకాలం ఆపైన కరెంటు కష్టాలతో దోమలు స్వైర విహారం చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సబ్ స్టేషన్ నుండి సఫరేటు బ్రేకర్‌ను ఎర్పాటు చేసి ఏజీఎల్ కలెక్షన్ తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామానికి రెండు 25 కేవీ విద్యుత్ బుడ్లను ఏర్పాటు చేసి గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమస్య పట్ల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలనీ, లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపడతామనీ వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి యాదయ్య, మాజీ ఉపసర్పంచ్‌లు జక్కు శ్రీనివాస్ రెడ్డి, ఇటిక్యాల శేఖర్ రెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాలూరి నరసింహ, రామచంద్రయ్య, బాలయ్య, శేఖర్, దరువుల జంగయ్య, ఎండి తాహీర్, జక్కు కొండల్ రెడ్డి, కల్లు రాజేశ్వర్ రెడ్డి, కోడుగంటి నరసింహ, వెంకటయ్య, కడారి పర్వతాలు, యాదయ్య, కొప్పు మల్లేష్, వెంకటయ్య, రాత్లావత్తు బాట నాయక్, బకా నాయక్, వాల్య నాయక్, రాము నాయక్, తోకల వెంకటయ్య, దాసరి గోపాల్, కాగుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.