జమ్మికుంట పట్టణంలో గత ఏడు సంవత్సరాలుగా నిత్య జనగణమన కార్యక్రమం కొనసాగుతుండడం హర్షించదగిన విషయమని నిత్య జనగణమనతో ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందుతుందని బీదర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు పేర్కొన్నారు. 2017 ఆగస్టు 15న అప్పటి జమ్మికుంట పట్టణ సీఐ పింగళి ప్రశాంత్ రెడ్డి దేశభక్తి పెంపొందించాలని ఒక మంచి ఆలోచనతో పట్టణంలోని 16 ప్రధాన సెంటర్లలో మైక్ సెట్ లోని ఏర్పాటు చేసి పట్టణ ప్రజలందరూ జాతీయ గీతాన్ని ఆలాపించే విధంగా ఏర్పాట్లు చేశారు. అప్పటి నుండి పట్టణంలో నిత్య జనగణమన ఒక యజ్ఞం లాగా కొనసాగుతూనే ఉంది. ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని పోలీస్ స్టేషన్ లో నిత్య జనగణమన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన సీనియర్ సిటిజన్స్ ఫోరం కు చెందిన కొంతమంది సీనియర్ సిటిజన్స్ జమ్మికుంటకు విచ్చేసి మంగళవారం నిత్య జనగణమన కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జమ్మికుంటలో నిత్య జనగణమన కార్యక్రమం కొనసాగుతుందని తెలుసుకున్నామని, అది ఎలా నిర్వహిస్తారు తెలుసుకొని మా ప్రాంతంలో కూడా దాన్ని అమలు చేద్దామని ఉద్దేశంతో నేడు జమ్మికుంటకు వచ్చామన్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పట్టణ సీఐ వరంగంటి రవిని వారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీదర్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు రామకృష్ణ , కార్యదర్శి వి ఎస్ ఉప్పిన్, కోశాధికారి గంగప్ప సావులే, సభ్యులు అరవింద్ కులకర్ణి, రతిన్ కమాల్, మల్లికార్జున్ పాటిల్, లింగప్ప టగారే తదితరులు పాల్గొన్నారు.