రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణి కారిడార్లు, అభయారణ్యాల్లోని వన్య ప్రాణుల జీవనానికి ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలని, వాటి సంరక్షణకు తగిన వాతావరణం కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా ఆ కారిడార్లు పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు వెళ్ళేందుకు సహకరించాలన్నారు.
బుధవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్యప్రాణి సంరక్షణతోపాటు, భారతమాల పరియోజన ద్వారా చేపట్టే నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం, షార్ సమీపంలో తీరప్రాంత రక్షణ, జెట్టీ నిర్మాణం , కడప – రేణిగుంట మధ్య రైల్వే లైన్ లో రోడ్లు నిర్మాణాలకు శాఖాపరంగా ఇచ్చే అనుమతులపై చర్చించారు. వీటికి సంబందించి అనుమతులు ఇచ్చే సందర్భంలో అవసరమైన ఉపశమన ప్రణాళికలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ల్లో చేపట్టిన ప్రాజెక్టులకు ఎలాంటి విధానాలు అనుసరించారో అధికారులు వివరించారు.
నేషనల్ టైగర్ కంజరేషన్ అథారిటీ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలు ఈ ప్రాంతాల్లో అధ్యయనం చేసి తగిన ఉపశమన ప్రణాళికలు సూచించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పీసీసీఎఫ్ ఎ.కె. నాయకు, స్టాడింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.