తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రశ్నించిన వారిపై దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని, యువకులను రెచ్చగొట్టి ఇంట్లో చొరబడి దాడులు చేయిస్తున్నాడని చేవేళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నివాసంపై బిఆర్ఎస్ నాయకులు దాడి చేయడంతో మంగళవారం చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ తదితరులు మురళీకృష్ణ గౌడ్ నివాసానికి చేరుకుని పరామర్శించారు.
శివ స్వాముల ఘటనలో అక్రమంగా కక్షపూరితంగా జైలుకు పంపించడం సిగ్గుచేటు అని వారంతా పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చీకటి కోణాలు, ఆక్రమ దందాలు అన్నీ మురళీకృష్ణ గౌడకు అంతా తెలుసని అందుకనే మురళీకృష్ణ గౌడ్‌ను చంపేదుకు యత్నించారని ఆరోపించారు. బీజేపీలో మురళీకృష్ణ గౌడ్ కు ఉన్న ఆదరణతో పాటు చేస్తున్న కార్యక్రమాలకు ఓర్వలేక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులుతో దాడులకు పాల్పడుడుతున్నారని కొండా బృందం ఆరోపించింది. రక్షణ కల్పించాల్సిన పోలీసుల ముందే బీఆర్ఎస్ నాయకులు వచ్చి దాడికి యత్నించడం దారుణమన్నారు. పోలీసుల సహకారంతోనే ఇంట్లో చొరబడి దాడులు చేసినట్టు వారు మండిపడ్డారు. ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలపై దాడికి యత్నించడం ముమ్మాటికి హత్యాయత్నమే అన్నారు.