ఉదండాపూర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. జడ్చర్ల పట్టణం సిగ్నల్ గడ్డ ప్రాంతంలో 167వ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు జాప్యం కావడంతో ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 8 ఏళ్ల క్రితం భూసేకరణ జరిగిన నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని, బుధవారం ఉదండాపూర్ ప్రాజెక్టును మంత్రులు పరిశీలిస్తుండగా పరిహారం ఇవ్వాలని అడిగే ప్రయత్నం చేస్తే వారిని పోలీసులు అడ్డుకొని బెదిరించడం, కేసులు పెడతామని భయపెట్టడం సరైనది కాదని, పాలమూరు ప్రాజెక్టు కు జీవో ఇప్పించింది నేనని, క్షేత్రస్థాయిలో పాలమూరు ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదన్నారు.
గత ప్రభుత్వం డిపిఆర్ మార్చడం వల్లే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగిందని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పెండింగ్ లో ఉన్న పరిహారాన్ని అందించాలని, బాధితులకు 25 లక్షల ప్యాకేజీ ఇస్తామన్న ప్రజాప్రతినిధులు వారికి ఇచ్చిన హామీ ప్రకారం చెల్లించి తగ్గిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.