Saturday, September 28, 2024
Homeఓపన్ పేజ్POCSO act: పోక్సో చట్టంలో కొత్త నిబంధనలు

POCSO act: పోక్సో చట్టంలో కొత్త నిబంధనలు

పోక్సో చట్టం కింద అది నేరమే..

చిన్న పిల్లలపై లైంగిక దాడుల నిరోధానికి సంబంధించిన పోక్సో చట్టం పరిధిని సుప్రీంకోర్టు మరింతగా విస్తరించింది. పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలను చూసినా, దగ్గర ఉంచుకున్నా, ఇంకొకరికి పంపించినా, ఇటువంటి చిత్రాలు తటస్థ పడినప్పుడు వెంటనే పోలీసులకు తెలియ జేయకపోయినా పోక్సో చట్టం కింద అది నేరమే అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు నిచ్చించి. మద్రాస్‌ హైకోర్టు ఈ విషయంలో కొద్ది కాలం క్రితం ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. చెన్నైకి చెందిన ఒక 28 ఏళ్ల వ్యక్తి పిల్లలకు సంబంధించిన రెండు నీలి చిత్రాలను తన ఫోన్‌లో డౌన్‌ లోడ్‌ చేసుకున్నట్టు పోలీసులు ఆరోపణ చేయడంతో దీనిపై మద్రాస్‌ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, మద్రాస్‌ హైకోర్టు ఈ కేసును కొట్టి వేయడం జరిగింది. పోక్సో చట్టం సెక్షన్‌ 15కు సంబంధించిన పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తరిస్తూ, పిల్లలపై లైంగిక దాడికి సంబంధించిన ఏ వ్యవహారమైనా పోక్సో చట్టం కిందకు వస్తుందని తేల్చి చెప్పింది.
ఇదివరకు పిల్లలకు సంబంధించిన నీలి చిత్రాలను వాణిజ్య ప్రయోజనాల కోసం తమ వద్ద ఉంచుకున్నవారి మీద మాత్రమే పోక్సో చట్టాన్ని ప్రయోగించడానికి అవకాశం ఉండేది. అయితే, దీన్ని ఇతరులతో పంచుకున్నా, దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా దీన్ని నేరంగా పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేయడం జరిగింది. పిల్లల నీలి చిత్రాలను తమ దగ్గర ఉంచుకోవడం, దాచిపెట్టుకోవడమంటే దాన్ని ఇతరులకు పంపించడం, దురుద్దేశాలు కలిగి ఉండ డం, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం కూడా అవుతుందని సుప్రీం కోర్టు వివరించింది. ఈ రకమైన కొత్త అర్థాలు, వివరణలు, నిర్వచనాల వల్ల పోక్సో చట్టానికి మరింతగా బలం పెరిగింది. పిల్లలపై లైంగిక దాడులను నిరోధించడంతో పాటు, పిల్లల విషయంలో నీలి చిత్రాలను రూపొందించడం వంటి విష సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తోంది. వీటిని నిరోధించడానికి సాంకేతికపరమైన, వ్యవస్థాపరమైన కఠిన చర్యలు అవసరమని కొద్ది కాలం ఓ రాజ్య సభ కమిటీ కూడా సిఫారసు చేసింది. వీటిని కఠినాతికఠినంగా అమలు చేయాలని కూడా సూచించింది.
ఏ చట్టమైనా నేరం చేసినప్పుడు మాత్రమే శిక్ష విధిస్తుంది కానీ, నేరం గురించి ఆలోచించినంత మాత్రాన శిక్షించే అవకాశం లేదు. అయితే, చిన్న పిల్లలకు సంబంధించిన నీలి చిత్రాల విషయంలో మాత్రం సుప్రీం కోర్టు ఇతరత్రా కూడా అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటోంది. ఇటు వంటి నీలి చిత్రాలను వెంటనే తొలగించకపోయినా, ధ్వంసం చేయకపోయినా, పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా, సదరు వ్యక్తి దాన్ని ఇతరులకు పంపించే ఉద్దేశంలో ఉన్నాడనో, ఇతరులతో పంచుకునే ఉద్దేశంతో ఉన్నాడనో న్యాయస్థానాలు పరోక్షంగా భావించడానికి సెక్షన్‌ 15(1) అవకాశం కల్పిస్తోంది. దిగువ న్యాయస్థానాలు ఈ చట్టాన్ని లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలని, సొంతగా భాష్యాలు చెప్పే ప్రయత్నం చేసి చట్టాన్ని నీరుకార్చకూడదని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించి పిల్లలపై ఎటువంటి సైబర్‌ నేరాలూ జరగకుండా నిరోధించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పిల్లల నీలి చిత్రాలు అనే మాటను ఉపయోగించకుండా, పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన సామగ్రిగానే వీటిని పరిగణించాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.
పిల్లల నీలి చిత్రాలను ఎవరు ఎప్పుడు చూసినా వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. లైంగిక విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. కొద్దిగా సంవ త్సరాలుగా పిల్లలపై లైంగిక దాడులు, పిల్లలను లైంగికంగా ఉపయోగించుకోవడం వంటి నేరాలు పెరుగుతున్నాయి. అయితే, ఫిర్యాదు చేయని కేసులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. లైంగిక దాడులు, లైంగిక వేధింపుల వల్ల పిల్లలు మానసికంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. వారి వ్యక్తిత్వమే కాక, వారి చదువులు, బంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు,బంధువులు, విద్యావేత్తలు, దర్యాప్తు అధికారులు వెంటనే వీటి విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. పిల్లలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి కాపాడడం సమాజ బాధ్యత, ప్రభుత్వాల విద్యుక్త ధర్మం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News