Sunday, November 24, 2024
Homeఓపన్ పేజ్Kadambini Ganguly: పాశ్చాత్య వైద్య వృత్తి చేపట్టిన తొలి భారతీయ వైద్యురాలు

Kadambini Ganguly: పాశ్చాత్య వైద్య వృత్తి చేపట్టిన తొలి భారతీయ వైద్యురాలు

బ్రిటీష్ ఇండియాలో తొలి మహిళా వైద్యులు

బెంగాల్ ప్రాంతంలో మత, సామాజిక మరియు విద్యాపరమైన పురోగమనం ఊపందుకుంటున్న సమయంలో కాదంబినీ బోస్ 1861 జూలై 18న భాగల్పూర్ (ప్రస్తుతం బీహార్) బ్రిటిష్ ఇండియాలో జన్మించడంతో ఆ ప్రభావం ఆమెపై బాగా పడింది. ఆ సమయంలో భారతీయ స్త్రీలకు విద్యావకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న భాగల్పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, బ్రహ్మ సమాజ్‌ సభ్యుడు మరియు దేశపు మొదటి మహిళా హక్కుల సంస్థ, భాగల్పూర్ మహిళా సమితి సహ వ్యవస్థాపకుడు అయిన ఆమె తండ్రి బ్రజ కిశోర్ బాసు కాదంబినిని పాఠశాలకు వెళ్లేందుకు ప్రోత్సహించారు. 1886లో ఆనందీబాయి జోషి అమెరికా లోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయం నుండి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందగా కాదంబినీ బోస్ గంగూలీ కూడా అదే సంవత్సరం గ్రాడ్యుయేట్ ఆఫ్ బెంగాల్ మెడికల్ కాలేజ్ (జిబిఎంసి) పట్టాను కలకత్తా వైద్య కళాశాల నుండి పొందారు. అయితే, ఆనందీబాయి ఫిబ్రవరి 26, 1887న పూణేలో క్షయ వ్యాధితో తన 21వ యేట మరణించడంతో డా కాదంబినీ పాశాత్య వైద్యవృత్తి చేపట్టిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. ప్రఖ్యాత సంఘసేవిక మరియు నర్సింగ్ వృత్తికి ఆద్యురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ తన స్నేహితురాలికి రాసిన ఉత్తరంలో కాదంబినీ గంగూలీ గురించి ప్రస్తావిస్తూ “వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో నవజాత శిశువుకు జన్మనిచ్చినప్పటికీ ఆమె కేవలం 13 రోజులు మాత్రమే ఇంటికి పరిమితమై దాదాపు ఒక్క లెక్చర్ కూడా మిస్ అవ్వలేదు” అని పేర్కొనడం వైద్యవృత్తి పట్ల ఆమెకు గల నిబద్ధతకు నిదర్శనం.

- Advertisement -

ఉన్నత వైద్య విద్య:
కాదంబినీ గంగూలీ 1886లో కలకత్తాలోని వైద్య కళాశాల నుండి గ్రాడ్యుయేట్ ఆఫ్ బెంగాల్ మెడికల్ కాలేజ్ (జిబిఎంసి) డిగ్రీని పొందిన మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్. 1893లో ఎడింబర్గ్, ఇంగ్లాండ్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ నుండి లైసెన్షియేట్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ (ఎల్ ఆర్ సి పి), లైసెన్షియేట్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఎల్ ఆర్ సి ఎస్) మరియు ఇర్లాండ్ లోని డబ్లిన్ నుండి గ్రాడ్యుయేట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ (జి ఎఫ్ పి ఎస్) పట్టాలను పొందారు. డాక్టర్ కాదంబినీ గంగూలీ భారతీయ వైద్యం మరియు మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రశంసనీయమైన కృషి చేసారు. ఈ ప్రస్థానంలో, పురుషాధిక్య సమాజంలో ఒక అభ్యదయ భావజాలం గల మహిళగా ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, మొక్కవోని ధైర్యంతో ముందుకు కొనసాగి అసాధారణమైన విజయాలను సాధించారు.

అన్నింటా ఫస్ట్:
దక్షిణాసియాలో మొట్టమొదటి మహిళా ఫిజిషియన్
భారతదేశంలో పాశ్చాత్య వైద్యవృత్తి చేపట్టిన ప్రప్రథమ మహిళా వైద్యురాలు
బ్రిటిష్ సామ్రాజ్యం నుండి వైద్య పట్టా పొందిన తొలి మహిళ

సామాజిక సేవ:
వైద్యవృత్తి కేవలం పురుషులకు సంబంధించిన అంశం అని భావించే ఆనాటి పురుషాధిక్య సమాజంలో ఆమె ఎంతో ధీరోదాత్తంగా వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సంఘ సంస్కరణ కోసం నడుం బిగించి బాల్య వివాహాలు, వరకట్నం మరియు వితంతువుల అణచివేత వంటి పద్ధతులను రద్దు చేయడం ద్వారా హిందూ సమాజాన్ని ఆధునీకరించడానికి అంకితమైన “బ్రహ్మ సమాజ్” ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాదు అదే సమయంలో మహిళల విద్య, హక్కుల సాధన, సామాజిక న్యాయం మరియు లింగ సమానత్వం కోసం ఆమె రాజీలేని పోరాటం చేసారు. మహిళాభ్యున్నతి మరియు వారి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా స్థాపించబడిన బెంగాల్ లేడీస్ అసోసియేషన్ లేదా బంగా మహిళా సమాజ్‌లో ఆమె క్రియాశీలక సభ్యురాలు. ఆమె స్త్రీ విద్య యొక్క ప్రాముఖ్యత పట్ల సమాజంలోని మహిళా లోకాన్ని చైతన్యపరుస్తూ మహిళల సాధికారత మరియు వారి సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో దాని కీలక పాత్రను వారికి విడమర్చి చెప్పేవారు. విద్యావంతులైన స్త్రీలు సమాజానికి దోహదపడడమే కాకుండా వారి జీవితాలకు సంబంధించిన అంశాల పట్ల సంపూర్ణ అవగాహనతో స్వతంత్రంగా సముచితమైన నిర్ణయాలు తీసుకునేందుకు మెరుగ్గా సన్నద్ధమవుతారని దృఢంగా విశ్వసిస్తూ, అందుకు బాలికలకు విద్యను అందించేందుకు ఆమె అవిశ్రాంతంగా కృషి చేసారు. ఆమె యొక్క రాజీ లేని తత్త్వం మరియు నిరంతర కృషి లింగ సమానత్వం మరియు సామాజిక న్యాయం, ముఖ్యంగా మహిళల ఆరోగ్య సంరక్షణలో పురోగతికి దోహదపడింది. ఆమె పోరాటం ద్వారానే మార్చి 19, 1891న ఆమోదించబడిన 1891 యొక్క ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్, యాక్ట్ ఎక్స్ (X) ఆఫ్ 1891 అని కూడా పిలువబడే బ్రిటీష్ ఇండియన్ చట్టం ఏర్పాటైంది. ఈ చట్టం ప్రకారం సంభోగం జరిపేందుకు సమ్మతి తెలిపే వివాహిత లేదా అవివాహితులైన బాలికల వయస్సును 10 నుండి 12 సంవత్సరాలకు పెంచబడింది. బాల్య వివాహాల నిర్మూలనకు గాత్రదానం ద్వారా బాలికలను మరియు వారి తల్లిదండ్రులను చైతన్యపరిచేవారు. ఆమె బీహార్ మరియు ఒరిస్సాలోని బొగ్గు గనులలోని మహిళా కార్మికుల జీవితాలపై నివేదిక ఇచ్చే కమిటీలో సభ్యురాలిగా పనిచేసింది.

స్వాతంత్ర సంగ్రామంలో పాత్ర:
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత కీలక భూమిక పోషించిన భారత జాతీయ కాంగ్రెస్‌లో డాక్టర్ కాదంబినీ గంగూలీ కూడా పాల్గొన్నారు. 1889లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐదవ సెషన్‌లో పాల్గొన్న మొదటి ఆరుగురు మహిళా ప్రతినిధులలో ఆమె ఒకరు కావడంతో పాటు 1890లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ సెషన్‌లో ఆమె మొదటి మహిళా స్పీకర్ కావడం విశేషం. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ స్థాపించబడిన ట్రాన్స్‌వాల్ ఇండియన్ అసోసియేషన్‌కు 1907లో మొదటి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె ప్రమేయం ఆమె వృత్తిపరమైన మరియు సామాజిక కార్యాచరణ యొక్క కలయికను ప్రదర్శించింది. రాజకీయ స్వాతంత్ర్యం సాధించడం మరియు సామాజిక అసమానతలను పరిష్కరించడం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఆమె నమ్మింది మరియు వలస ఆధిపత్యం మరియు సామాజిక అసమానతల నుండి విముక్తి పొందిన సమాజాన్ని నిర్మించడానికి ఆమె తనను తాను అంకితం చేసుకుంది.

సవాళ్లు మరియు అడ్డంకులు:
ఈ మజిలీలో డా కాదంబినీ అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో భారతీయ వైద్యరంగంలో మహిళా అగ్రగామిగా కొనసాగిస్తున్న ఆమె, వృత్తిపరమైన సామర్థ్యాలలో మహిళలను స్వీకరించడానికి సిద్ధంగా లేని సమాజం నుండి గణనీయమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. సహచరులు మరియు విస్తృత సమాజం నుండి లింగ పక్షపాతం, సందేహాత్మక వ్యవహారశైలి మరియు వివక్షను అధిగమించడం కోసం డాక్టర్ గంగూలీ సంయమనాన్ని పాటిస్తూ ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. 1891లో, హిందూ సనాతన ధర్మానికి చెందిన ‘బంగాబాసి’ అనే పత్రిక ఆమెను వేశ్యగా అభివర్ణించడం అత్యంత హేయమైన సందర్భం. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆమె తన భర్త ద్వారకానాథ్ గంగూలీతో కలిసి ఎడిటర్ మహేష్ చంద్ర పాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయపోరాటం చేయగా, న్యాయస్థానం అతను కుట్రపూరితమైన చర్యలకు పాల్పడినట్లు నిర్ధారించి రూ.100 జరిమానా మరియు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వృత్తిపరమైన బాధ్యతలు మరియు వ్యక్తిగత జీవితం సమతుల్యం చేసుకోవడం ఆమెకు మరో ముఖ్యమైన సవాలుగా పరిణమించింది. వైద్య వృత్తిని కొనసాగిస్తూ, సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న సమయంలో ఇద్దరు సవతి పిల్లలతో పాటు మొత్తం ఆరుగురు పిల్లల సంరక్షణ బాధ్యత నిర్వహించడం ఆమె లోని అసాధారణమైన బహుముఖ సామర్థ్యాలకు, స్థితిస్థాపకతకు మరియు అచంచలమైన సంకల్పానికి నిజమైన ప్రతిబింబం.

ఆదర్శప్రాయమైన జీవితం:
డా కాదంబినీ గంగూలీ వృత్తి, సామాజిక మరియు వ్యక్తిగత జీవితం కేవలం వైద్యరంగంలో మహిళలకు మాత్రమే కాకుండా సాధారణ మహిళలకు కూడా ఆదర్శప్రాయమైనది మరియు ప్రేరణాత్మకమైనదని చెప్పవచ్చు. ఆమె స్ట్రోక్ కారణంగా అక్టోబర్ 3, 1923న ఈ లోకం నుండి నిష్క్రమించారు. అయితే వైద్యం మరియు సామాజిక న్యాయానికి ఆమె చేసిన కృషి ప్రస్తుత తరాలతో పాటు భవిష్యత్ తరాలను కూడా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఆమె జీవితం భారతదేశంలోని ప్రస్తుత మరియు భవిష్యత్ తరాల మహిళా వైద్యులకు ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, లక్ష్యాలను సాధించడంలో పట్టుదల మరియు సంకల్పం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పేదే డా కాదంబినీ గంగూలీ యొక్క జీవిత సారాంశం.

యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News