గత సెప్టెంబర్ 22న ఐక్యరాజ్య సమితిలో జరిగిన ‘భవిష్య సమ్మేళనం’ ఏ విధంగా చూసినా చరిత్రాత్మకమైంది. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిని మరింత సమర్థవంతంగా, పటిష్ఠంగా, భాగస్వామ్యయుతంగా, జవాబుదారీతనంగా, ప్రాతినిధ్యంగా, ప్రజాస్వామికంగా, పారదర్శకంగా పని చేయించడానికి కొన్ని సంస్కరణలు చేపట్టాలని కోరుతూ అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయంతో ఒక భవిష్య ఒప్పందం జరగడం ఒక బృహత్తర మార్పునకు నాంది పలికింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇంతవరకూ అయిదుగురు శాశ్వత ప్రతినిధులు, పదిమంది తాత్కాలిక ప్రతినిధు లతో పని చేస్తూ వస్తోంది. ఇందులో కొత్తగా ఏదైనా దేశం శాశ్వత సభ్యురాలయ్యేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. అయితే, దీన్ని సంస్కరించడానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక నిర్ణయమంటూ జరిగింది. రెండు దేశాల మధ్య యుద్ధాలు చోటు చేసుకున్నా, దేశాల మధ్య ఏవైనా వివాదాలు చెలరేగినా భద్రతా మండలి వాటిని నివారించడానికి, నిరోధించడానికి ఏనాడూ చర్యలు చేపట్టడం జరగలదు. ఒక విధంగా చూస్తే ఇది మొదటి నుంచి అసమర్థంగానే పని చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో ఒక భవిష్య ఒప్పందం జరగడం హర్షణీయ విషయం.
భద్రతా మండలిలో తమకు శాశ్వత సభ్యత్వం కల్పించడంతో పాటు ఈ మండలిని మరింత విస్తరించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న భారతదేశం ఈ నిర్ణయాన్ని ‘శుభసూచకం’గా అభివర్ణించింది. తక్షణం సంస్కరణలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకుని భద్రతా మండలిని సమూలంగా సంస్కరించాలని అది కోరింది. నిజానికి సంస్కరణలు చేపట్టాలని దాదాపు ప్రతి దేశమూ భావిస్తున్నప్పటికీ, ప్రతిబంధకాలు సృష్టించే దేశాల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. అయిదు దేశాల శాశ్వత సభ్యత్వంతో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన భద్రతా మండలి ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తోందే తప్ప ఆధునిక పరిస్థి తులకు అనుగుణంగా వ్యవహరించడం లేదు. ఈ మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన అయిదు దేశాలు కూడా ప్రపంచ సంక్షేమం కోసం, క్షేమం కోసం చేస్తున్నదేమీ లేదు. తమకున్న వీటో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవి విర్రవీగుతున్నాయనే అభిప్రాయం ప్రపంచ దేశాలన్నిటిలోనూ నెలకొని ఉంది. ఇవి యుద్ధాలను, వివాదాలను నివారించకపోగా, వివిధ దేశాల మధ్య వాటిని మరింతగా రెచ్చగొడుతున్నాయి. విచ్ఛిన్నకర ధోరణులను అనుసరిస్తున్నాయి. ఇతర దేశాల ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. ఒక దేశం మీదకు మరో దేశాన్ని ఉసిగొల్పు తున్నాయి.
ఈ కారణాల వల్లే ప్రపంచ దేశాలకు భద్రతా మండలి మీద నమ్మకం పోయింది. ఈ మండలిలో సంస్కరణలు జరగడానికి అవకాశం ఉందని, దీనివల్ల ప్రపంచం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందనే నమ్మకం కూడా ఏ దేశానికీ లేదు. ఇది అసాధ్యాల్లోకెల్లా అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ లతో కూడిన నాలుగు దేశాల కూటమి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, సిఫారసు చేసుకోవడం జరుగుతోంది. గత మార్చిలో ఈ నాలుగు దేశాలు సమావేశమై, భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టానికి అంతర్జాతీయ స్థాయి చర్చలు, సంప్రదింపులు జరగాలని ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. భద్రతా మండలిలో మరో ఆరుగురు శాశ్వత సభ్యులు, అయిదుగురు తాత్కాలిక సభ్యులకు అవకాశం కల్పించాలని కూడా ఈ సమావేశం కోరింది. నిజానికి ప్రస్తుత అయిదు శాశ్వత సభ్య దేశాలకు ఉన్న వీటో అధికారమే ప్రపంచ దేశాలకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ఈ వీటో అధికారాన్ని ఉపయోగించడంలో వెసులుబాటును కల్పించాలని అవి కోరుతున్నాయి. ముఖ్యంగా దీనిపైనే కూలంకషంగా చర్చ జరగాలని కూడా ఇవి పట్టుబడుతున్నాయి.
ఒకవేళ్ల అన్ని చర్చలూ, సంప్రదింపులూ సానుకూలబడి, భద్రతా మండలిని విస్తరించే పక్షంలో ఏ దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న విషయం కూడా వివాదాస్పదంగా కనిపిస్తోంది. శాశ్వత సభ్యత్వం కలిగిన అయిదు దేశాల్లో ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా దేశాలు భారత్ కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. గత వారం జరిగిన సమావేశంలో కూడా వారు భారతదేశానికి అనుకూలంగానే వ్యవహరించాయి. అయితే, చైనా మాత్రం తీవ్ర అభ్యతరం తెలియజేస్తోంది. నిజానికి, అనేక అంతర్జాతీయ విషయాలో భారతదేశం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుండడం ఈ దేశాలకు నచ్చడం లేదు. భవిష్య సమ్మేళనంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం తక్షణావసరమని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత అయిదు సభ్యత్వ దేశాలు ఈ విషయంలో అడుగు ముందుకు పడనిస్తాయా అన్నది ప్రశ్న.
UN Security council expansion: భద్రతా మండలిలో సంస్కరణలపై పట్టు
‘భవిష్య సమ్మేళనం’ చరిత్రాత్మకం..