Thursday, December 12, 2024
Homeఓపన్ పేజ్Workplace Stress: కార్పొరేట్‌ సంస్థలో పని భారం, పని ఒత్తిడి

Workplace Stress: కార్పొరేట్‌ సంస్థలో పని భారం, పని ఒత్తిడి

వల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ లో మనం ఎక్కడ?

అనేక కార్పొరేట్‌ సంస్థల్లో పని భారం, పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్న కారణంగా అనారోగ్యాలు, ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతున్నట్టు కార్మిక విభాగాలు, కార్మిక సంఘాల అధ్య యనాలు తెలియజేస్తున్నాయి. పుణేలో ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ అనే సంస్థలో పనిచేస్తున్న ఒక అన్నా సెబాస్టియన్‌ పెరియాల్‌ అనే నడి వయసు మహిళ ఈ మధ్య అకాల మరణం చెందారు. తాను పనిభారం, పని ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యం పాలయినట్టు ఒక బహిరంగ లేఖ రాసి కన్నుమూశారు. ముంబైలో సెక్యూరిటీస్‌ అ్‌ండ ఎక్చ్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)లో పని చేస్తున్న సుమారు 500 మంది ఉద్యోగులు పనిభారం విషయంలో గత వారం నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. సంస్థ అధికారులు, సి.ఇ.ఓలు తమకు అలవికాని లక్ష్యాలను నిర్దేశించడం వల్ల తమ మీద మానసిక ఒత్తిడి బాగా పెరుగుతోందని, పని సంస్కృతి, పని భారం, సుదీర్ఘ పని వేళలు, సెలవులు లేకపోవడం, అవమానించడం, దుర్భాషలాడడం వంటివి తమను మానసికంగా కుంగదీస్తూ అనారోగ్యాల పాలు చేస్తున్నాయని వారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది.
వాస్తవానికి గత పది పదిహేనేళ్ల కాలంలో అనేక కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగుల నుంచి ఇదే రకమైన ఫిర్యాదులు ప్రభుత్వాలకు అందుతున్నాయి. కొన్ని సంస్థలను మినహాయిస్తే దేశంలోని దాదాపు ప్రతి కార్పొరేట్‌ సంస్థా ఈ విష పని సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయని ‘ఇండియన్‌ వర్క్‌ ఫోర్స్‌’ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం కార్పొరేట్‌ సంస్థల్లో పని చేసే ప్రతి ఉద్యోగి సగటున 12 నుంచి 14 గంటల పాటు పని చేయడం జరుగుతోంది. శని, ఆదివారాల్లోనే కాక, అధికారిక సెలవు రోజుల్లో కూడా కనీసం పది గంటలపాటు పనిచేయాల్సి వస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులు 24 గంటలూ అధికారులతో టచ్‌ లో ఉండాల్సి వస్తోంది. అధికారులు అలవి కాని లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు దుర్భాషలాడడం, అందరి ముందూ అవమానించడం అనేది సర్వసాధారణ విషయమైపోయింది. ఉద్యోగ బాధ్యతల్లో దుర్భాషలకు గురి కావడమన్నది ఒక భాగంగా మారిపోయింది. అధికారులు మధ్య మధ్య తమను అవమానించడం, చులకనగా మాట్లా డడం, ఎద్దేవా చేయడం, దుర్భాషలాడడం రోజూ కాకపోయినా వారానికి ఒకటి రెండుసార్లయినా జరుగుతూనే ఉంటుందని, ఇది తమకు అలవాటైపోయిందని ఉద్యోగుల్లో సుమారు 76 శాతం మంది అధ్యయనాల సందర్భంగా బయటపెట్టడం జరిగింది.
పని వేళలు ఎక్కువగా ఉండడమనేది కూడా ఒక సహజ విషయంగా మారిపోయింది. వారానికి 70 గంటలు పని చేయాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల ఇన్ఫోసిస్‌ కు చెందిన నారాయణ మూర్తి ప్రకటించడం కార్పొరేట్‌ సంస్థల అభిప్రాయానికి అద్దం పడుతోంది. అంటే, వారానికి అయిదు రోజులయ్యే పక్షంలో రోజుకు 14 గంటలు పనిచేయాల్సి ఉంటుందన్న మాట. ఆరు రోజుల పని దినాలు ఉన్నప్పటికీ పని వేళలు 12 గంటల వరకూ ఉండే అవకాశం ఉంది. సి.ఇ.ఓలు, ఎం.డిలు, ఉన్నతాధికారుల మనసులోని మాట ఇది. ఇది క్రమంగా ఒక నిబంధనగా మారిపోతోంది. గత పది పదిహేనేళ్ల కాలంలో కార్పొరేట్‌ సంస్థలు జీతభత్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అధికారులు, యజమానులు తాము తమ ఉద్యోగులను కొనేసుకున్నట్టుగా వ్యవహరిస్తుంటారు. భారీ జీతాలను ఇస్తున్నందువల్ల ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేయ డానికి, వారాంతాల్లో కూడా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడి ఉండాలని అధికారులు భావిస్తుం టారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక మొబైల్‌ ద్వారా, ఇంటర్నెట్‌ ద్వారా, వాట్సప్‌ ద్వారా, ఇ-మెయిల్‌ ద్వారా, లాప్‌ టాప్‌ ద్వారా ఉద్యోగులు అధికారులతో టచ్‌ లోనే ఉండాల్సి రావడం వల్ల మానసిక ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటోంది.
ఇదివరకు అవ్యవస్థీకృత రంగానికే పరిమితమైన సుదీర్ఘ పనివేళలు, భారీ లక్ష్యాలు ఇప్పుడు కార్పొరేట్‌ రంగానికి విస్తరించినట్టు కనిపిస్తోంది. ఇక 2023లో అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం, భారతదేశంలో కార్పొరేట్‌ ఉద్యోగులు వారానికి సగటున 47.7 గంటలు పనిచేయడం జరుగుతోంది. పది అత్యున్నత స్థాయి ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకున్న పక్షంలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని కూడా ఆ సంస్థ పేర్కొంది. నిజానికి భారతదేశంలో పని వేళలు ఈ సంస్థ పేర్కొన్న దానికంటే ఎక్కువగానే ఉన్నాయని, పైగా దీనిలో రవాణ సమయాన్ని చేర్చలేదని ఇండియన్‌ వర్క్‌ ఫోర్స్‌ అనే సంస్థ తెలిపింది. అటు అవ్యవస్థీకృత రంగంలోనూ, ఇటు వ్యవస్థీకృత రంగంలోనూ పనివేళలు, పని భారం, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువల్లే తాజా వరల్డ్‌ హ్యాపీనెస్‌ నివేదికలో భారతదేశం 147 ర్యాంకుల్లో 126వ ర్యాంకును సంపాదించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News