Thursday, October 3, 2024
HomeతెలంగాణCM Revanth launches family digital cards pilot project: వన్ స్టేట్ వన్...

CM Revanth launches family digital cards pilot project: వన్ స్టేట్ వన్ కార్డుగా కుటుంబ డిజిటల్​ కార్డు

119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా..

కుటుంబ గుర్తింపు మరియు కుటుంబ డిజిటల్​ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులని సీఎం రేవంత్ వివరించారు. ఇవాళ్టి నుంచి 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నాం.

- Advertisement -

రేషన్ కార్డుకి-ఫ్యామిలీ డిజిటిల్ కార్డుకు తేడా తెలీదు..

రేషన్ కార్డు కావాలని ప్రజలు పదేళ్లు చెప్పులరిగేలా తిరిగినా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని, ప్రతీ పేద వాడికి రేషన్ కార్డు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించిందని రేవంత్ తెలిపారు. అందుకే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామన్న ఆయన, కొంతమందికి రేషన్ కార్డుకి, ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో వివిధ శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరుస్తామన్నారు సీఎం.

వన్ స్టేట్ వన్ కార్డు..

30శాఖల సమాచారం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళుతోందని ఆయన తెలిపారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేందకే ఈ విధానమన్నారు. మీ కుటుంబాలకు ఒక రక్షణ కవచంలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటుందని, అన్ని సంక్షేమ పథకాలు ఒకే కార్డు ద్వారా అందించనున్నామని, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఈ కార్డు ఉపయోగపడుతుందని రేవంత్ వివరించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరుస్తామని, పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డని ఆయన తెలిపారు.

ఆర్డీవో స్థాయి అధికారి ఆధ్వర్యంలో..

అమలులో సమస్యలు గుర్తించేందుకు ఇవాళ పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నామని, పైలట్ ప్రాజెక్ట్ లో వచ్చే సమస్యల ఆధారంగా పరిష్కారాలతో ముందుకెళతామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఆర్డీవో స్థాయి అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమిస్తున్నామని, ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే కుటుంబ పెద్దగా పొందుపరుస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసింది తప్పులు.. అప్పులే..వీటితో రాష్ట్రం నిండా మునిగిందని ఆరోపించారు. ఆ తప్పులు… అప్పులను సరిదిద్దుతూ ముందుకు వెళుతున్నామని, పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు కనోన్మెంట్ సమస్యలను పరిష్కరించలేదని, మేం అధికారంలోకి వచ్చాక కేంద్రానికి భూ బదలాయింపు ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

నగరాన్ని కాపాడేందుకే..

కల్వకుంట్ల కుటుంబం అధికారంతో పాటు విచక్షణ కొల్పోయిందని, పదేళ్లు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు.. అందుకే ప్రజలు మీ ఉద్యోగం ఊడగొట్టారని సీఎం ఆరోపించారు. మేం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలు చేపట్టామన్న సీఎం.. హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నామన్నారు. కిరాయి మనుషులతో మీరు చేసే హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోందని, పదేళ్లు మీరు దోచుకున్న సొమ్ము మీ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు మూలుగుతున్నాయన్నారు సీఎం రేవంత్. అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు పంచి పెట్టాలన్న రేవంత్.. ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి… ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మూసీ మురికిలో బ్రతుకుతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, రూ.25వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామన్నారు.

మీ ఫామ్ హౌసులు కూలతాయనే..

మీ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారన్న ఆయన, కేటీఆర్ అక్రమంగా నిర్మించిన మీ ఫామ్ హౌజులు కూల్చాలా వద్దా? సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి.. వాటిని కూలగొట్టాలా వద్దా..? ఫామ్ హౌసులు కూలుతాయనే పేదలను అడ్డు పెట్టుకుంటుని రేవంత్ ఆరోపించారు. నల్లచెరువులో, మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మింది మీ పార్టీ నాయకులు కాదా..? 20ఏళ్లు ప్రజల్లో తిరిగినవాన్ని నాకు పేద ప్రజల కష్టాలు తెలియదా? మూసీని అడ్డు పెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారు..? జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉంది… రండి పేదలకు పంచి ఇందిరమ్మ ఇండ్లు కట్టిద్దామని ఆయన అన్నారు.

ఈటలకు పాత వాసన పోలేదే..

ఇక్కడి ఎంపీ మోడీ దగ్గర నుంచి ఏం తీసుకొస్తారో చెప్పాలన్న సీఎం సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయొచ్చు కానీ.. మూసీని అభివృద్ధి చెయ్యొద్దా ఈటెలా? కేటీఆర్, హరీష్ లు మాట్లాడిన జిరాక్స్ కాపీ తీసుకుని ఈటెల మాట్లాడుతున్నారన్నారు పార్టీ మారినా ఈటెలకు పాత వాసనలు పోలేదని, మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు ఇండ్లు తీసుకురావడానికి మోదీ దగ్గరకు వెళదాం రండి… నాకు రావడానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు.

లెక్కలు తీద్దాం రండి..

బీఆరెస్, బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా… నగరంలో చెరువుల లెక్క, ఆక్రమణల లెక్క తీద్దాం రండి…వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయంటూ సీఎం చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపచేస్తోంది. దీంతో వరదలు వచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయని, ఇప్పటికే చెరువులు, నాళాలు మూసుకుపోయాయి.. ఇలాగే చూస్తే.. ఇంకొన్నాళ్లకు మూసీ కూడా మూసుకుపోతుందని రేవంత్ అన్నారు. రాజకీయాల్లో నాకు లోతు తెలియక కాదు.. నగరానికి మంచిభవిష్యత్ ను అందించేందుకే మా చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు. పేదల దుఃఖం నాకు తెలుసు.. పేదవాడి కన్నీళ్లు చూడలని మేం కోరుకోవడంలేదని ఆయన తెలిపారు. ప్రతీ పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించడమే మా ప్రభుత్వ ఉద్దేశమన్న సీఎం చెరువులు, నాళాలు, మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే… పేదలకు ఎలా న్యాయం చేద్దామో మీరు అది చెప్పాలన్నారు.

మీ పదేళ్ల పాలన దోపిడీకే పనికి వస్తుందా…?

పదేళ్లు పాలించామని, అనుభవం ఉందని చెబుతున్న వాళ్ళు పేదలకు ఏం చేద్దామో చెప్పండి అంటూ గులాబీ పార్టీని నిలదీస్తూ సాగిన సీఎం ప్రసంగంలో.. మొత్తం మంత్రివర్గాన్ని తీసుకువస్తా.. మోదీ వద్దకు తీసుకెళ్లి ఈటెల రూ.25వేల కోట్లు నిధులు ఇప్పించగలరా… అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇళ్లు లేని పేదలకు ఇండ్లు ఇవ్వడం నేరమా? విషాన్ని దిగమింగుతున్న నల్లగొండ ప్రజలను కాపడలనుకోవడం తప్పా? మీకు ఓటు వేయనందుకు నల్లగొండ ప్రజలను చంపేయాలని చూస్తారా? మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరం లేదు…రాజకీయాల కోసం మూసీ ప్రాజెక్టు చేపట్టలేదు.. హైదరాబాద్ భవిష్యత్ కోసమే మేం ఈ ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు.

సంచులు తీసుకున్నవాళ్ళకే సంచుల గురించి తెలుస్తదన్న సీఎం రేవంత్, ఇండ్లు తొలగిస్తే ఎవరైనా సంచులు ఇస్తారా? తిట్లు తప్ప..అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. దోపిడీ సొమ్ముతో కేటీఆర్ అడ్డగోలు పనులు చేస్తే ప్రజలు క్షమించరని రేవంత్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News