సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న సీఎం రేవంత్, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించారు.
ఐకేపీ సెంటర్ల కి సీరియల్ నెంబర్లు ఇవ్వాలన్న సీఎం, సన్నవడ్లపై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. గోనె సంచులను అందుబాటులో ఉండాలని, ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులను ఇన్వాల్వ్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధ్యానం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు కలెక్టర్లు రెండు గంటలు ధాన్యం కొనుగోలు పైన సమీక్ష జరపాలని, ధాన్యం కొనుగోళ్ల పైన కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిని సహించవద్దు… క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.
రాష్ట్రంలో వంద శాతం రైతులు సన్నబియ్యం పండించేలా చొరవ చూపించాలని, వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనల ప్రకారం ఐకేపీ సెంటర్లలో ఏర్పాట్లు చేయాలన్నారు.