Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Development: అభివృద్ధికి అగ్రస్థానం

Development: అభివృద్ధికి అగ్రస్థానం

ఒక పారిశ్రామిక, టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్ర ప్రదేశ్‌కు ఉన్న అవకాశాలు మరే రాష్ట్రానికీ లేవని నిపుణులు, విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. సుమారు 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం, ఆరు రేవు పట్టణాలు, అత్యంత అద్భుతమైన, నిరుపమానమైన నైపుణ్యాలు, మూడు పారి శ్రామిక కారిడార్లు, భారీగా భూసంపద. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోవడానికి ఇంతకన్నా ఏం కావాలి? అయితే, రాజకీయ చిత్తశుద్ధి కొరవడిందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా తగినంత శ్రద్ధ తీసుకుని ఉంటే ఇతర రాష్ట్రాలకు దీటుగా పురోగతి సాధించి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం, బీజేపీ వంటి ప్రతిపక్షాలు ఇదే రకమైన ప్రచారాన్ని అస్త్రంగా చేసుకుని పాలక పక్షం మీద పోరాటం సాగిస్తున్నాయి. నిజానికి ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీ లించాల్సి ఉంది. వివిధ కోణాల నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా సంక్షేమ పథకాల మీద భారీగా పెట్టుబడులు పెడుతున్న మాట నిజం. ఆరోగ్య, విద్యారంగాలకు సంబంధించిన పథకాల మీద కనీ వినీ ఎరుగని శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తోంది. వ్యాపార సానుకూల వాతావరణంలో, అంటే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మొదటి స్థానంలో ఉంది. కోవిడ్‌ వంటి విపత్కర మహమ్మారి విజృంభిం చినప్పుడు కూడా వృద్ధి రేటులో మార్పేమీ లేకపోవడం కూడా గమనించాల్సిన విషయం. అయితే, ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. వెనుకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులను కట్టుకోవడంలో, ఆహ్వానించడంలో దూకుడుగా, చొరవగా వ్యవహరించడం లేదన్నది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. మార్కెటింగ్‌ నైపుణ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు తన హయాంలో అనేక పర్యాయాలు పెట్టుబడుల శిఖరాగ్ర సదస్సును నిర్వహించి, రాష్ట్రంలోని అవకాశాలు, వనరుల గురించి పెద్దగా ప్రచారం చేశారు. కానీ, ఆయన ఎంతగా ప్రయత్నించినా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టుగా అమరావతిని మాత్రం అభివృద్ధి చేయలేకపోయారన్నది వాస్తవం.
ఆంధ్ర ప్రదేశ్‌ విభజన జరిగి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లుగా విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రంగానే మిగిలి పోయింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, వీటికి సంబంధించిన వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి వంటి రంగాలలో మాత్రమే ఇక్కడ అభివృద్ధికి అవకాశం ఉంది. జగన్మోహన్‌ రెడ్డి వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కోవిడ్‌ కాలంలో రాష్ట్రం నిలదొక్కుకోవడానికి అవకాశం కలిగింది. ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలకుండా ఉండడానికి ఇవి చాలావరకు దోహదం చేశాయి. ఆర్థిక సమస్యలు ఒక పక్క కోవిడ్‌ మరొకపక్క రాష్ట్రాన్ని పట్టి కుదుపుతున్నప్పటికీ సంక్షేమ పథకాలే రాష్ట్రాన్ని ఇప్పటి వరకూ ఆదుకున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతు న్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించింది. ఆంధ్ర ప్రదేశ్ను ఒక పెట్టుబడులు గమ్యస్థానంగా ప్రదర్శించడానికి, పెట్టు బడులను ఆహ్వానించడానికి నడుం బిగించింది. ఈ ప్రయత్నం ఆలస్యంగానే ప్రారంభం అయి ఉండవచ్చు. కానీ, ఇది సకాలంలోనే ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది.
మార్చి 3, 4 తేదీలలో విశాఖపట్నంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ పెట్టుబడిదార్ల శిఖరాగ్ర సద స్సును ఏర్పాటు చేయడం ఈ దిశగా వేస్తున్న మొదటి ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. రాష్ట్రంలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అవకాశాల గురించి, సహజ వనరుల గురించి, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, వెసులుబాట్ల గురించి పెట్టుబడిదార్లకు కూలంకషంగా తెలియడం కోసం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. విశాఖ పట్నాన్ని రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేయాలన్న గట్టి సంకల్పంతో ఈ ఉక్కు నగరం గురించి, ఇక్కడి సౌకర్యాలు, అవకాశాల గురించి పారిశ్రామిక వేత్తలకు, వాణిజ్యవేత్తలకు తెలియజెప్పాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. పారిశ్రామికండగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడానికి విశాఖకు ఉన్న అవకాశాలు మరో నగరానికి లేవు. అయితే, ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఉత్పత్తి పరిశ్రమలను నెలకొల్పడానికి,, టెక్‌ కంపెనీలను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత సానుకూల వాతావరణంలో విడిగా కూడా గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంది. హైదరాబాద్‌ను దృష్టిలో పెట్టుకుని పోటీపడాల్సి ఉంటుంది.

– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News