కరీంనగర్ జిల్లా కొత్తపల్లి లోని ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినిలచే అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మలను తయారుచేసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆటలు ఆడారు. కళాశాల ప్రాంగణం పండగ వాతావరణాన్ని తలపించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ దేవతలను పూలతో పూజిస్తారని అదే పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి మనది అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఉందని పలు దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని ,మన పండుగల యొక్క విశిష్టతను తెలిపేందుకు విద్యార్థుల్లో నూతనత్తేజాన్ని నింపేందుకు విద్యాసంస్థల్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ బతుకమ్మ పండుగ అని తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మికతతో ప్రత్యేక వాతావరణాన్ని కల్పిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థినిలు అత్యంత భక్తిశ్రద్ధలతో బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..