శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ముఖ్యమంత్రి బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ కార్య నిర్వహణాధికారి శ్యామల రావు అదనపు ఈఓ సిహెచ్ వెంకట చౌదరి, స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు.
ముఖ్యమంత్రి వెంట దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్య నారాయణ, సివీఎస్వో శ్రీధర్, జెఈఓ వీర బ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పి సుబ్బరాయుడు, జెసి శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య తదితరులు ఉన్నారు.