ప్రతిష్టాత్మక జాతీయ సాంస్కృతిక వేదిక రవీంద్రభారతిలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి అనసూయ సీతక్క రవీంద్రభారతిలో జరిగిన బతుకమ్మ వేడుకలలో వందలాది మంది మహిళలతో కలిసి పాల్గొన్నారు. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు అపురూపమైన పండుగని, ఈ పండుగ మనందరిలో గొప్ప శక్తిని, మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి, బతుకు పట్ల, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచే పండుగ అని ఆమె అన్నారు. బతుకమ్మను పేర్చడంలోనే ఒక గొప్ప కళాత్మకత ఉంటుందని, తీరొక్క పువ్వులను, అడవిలో పుట్టిన పూలనూ తీసుకువచ్చి ఒక్కచోట చేర్చి అందమైన సుందరమైన బతుకమ్మగా ఆడబిడ్డలు పేర్చి ప్రకృతికి నివేదన చెబుతారని ఆమె అన్నారు. మహిళా శక్తికి, మహిళలో ఉండే అనేక నైపుణ్యాలకు బతుకమ్మ ఒక ఉదాహరణ అని, గునుగు పూలు, తంగేడు పూలు, గుమ్మడి పూలు, సీతజడ పువ్వు ఇలా రకరకాల పూలతో ఏర్పాటు చేసే బతుకమ్మ ఒక జీవన పాఠం అనీ, పూలనే దేవుడిగా కొలిచే సంప్రదాయం తెలంగాణలో ఆడబిడ్డల వల్లనే కొనసాగుతుందని, ఇలాంటి ఎన్నో సంప్రదాయాలకు, జీవన విలువలకు అమ్మలు, మహిళలు వారధిగా నిలుస్తున్నారని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.
నగరంలో రవీంద్ర భారతి లాంటి వేదికలో సకల జనులు, సబ్బండ వర్ణాల ప్రజలకు అందుబాటులో తొమ్మిది రోజులపాటు ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం సంతోష దాయకమని, ఇలాంటి ప్రజా ఆమోదయోగ్యమైన పని నిర్వహిస్తున్న భాషా సాంస్కృతిక శాఖను ఆమె అభినందించారు. బాగ్ లింగంపల్లి నుంచి లింగంపల్లి వరకు వివిధ ప్రాంతాల నుంచి
విచ్చేసిన మహిళలు అందరూ సీతక్కకు ఎదురు వెళ్లి స్వాగతం పలికి ఆమెతో కలిసి బతుకమ్మ పాటలు, ఆటలతో ఆనందంగా ఆడి పాడారు. మహిళలు అందరితో కలిసి మంత్రివర్యులు
ఎంతో సంతోషంగా చప్పట్ల పాటలతో పెద్ద బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ బతుకమ్మకు
నీరాజనాలు అర్పించారు.
రకరకాల విద్యుద్దీపాలతో అలంకరించిన ప్రాంగణం ఉత్సాహాన్ని కలిగించే లాగా ఉండటం సంతోషకరమని, గోడలపై పెట్టిన బతుకమ్మ పాటల పోస్టర్లు, పాటలు పూర్తిగా తెలియని ఈ తరం యువతకు మార్గదర్శిగా నిలుస్తాయని ఆమె ప్రస్తావిస్తూ, బతుకమ్మ పాటలలో కుటుంబ విలువలు, జీవన విలువలు, మానవ సంబంధాలు, మనిషి ప్రకృతి – పర్యావరణానికి మధ్య ఉండే అనుబంధాలు ఎంతో చక్కగా మన జానపదులు మనకు అందించారని ఆమె గుర్తు చేశారు.