డైలేటెడ్ కార్డియోమియోపతి వల్ల ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 39 ఏళ్ల మహిళా రోగికి బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సతో రోగికి పునర్జన్మ
హైదరాబాద్ 7th అక్టోబర్ 2024: ఎడమ జఠరిక పనిచేయకపోవడంతో తలెత్తిన గుండె వైఫల్యం, పునరావృతం అవుతున్న అరిథ్మియాతో డైలేటెడ్ కార్డియోమియోపతి వల్ల ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 39 ఏళ్ల మహిళా రోగికి బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రి వైద్య బృందం విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడింది. అధునాతన కార్డియాక్ కేర్లో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ఈ సంక్లిష్ట ప్రక్రియ ఆసుపత్రి విజయాన్ని సూచిస్తుంది. కేర్ ఆస్పత్రి మెడికల్ సుపరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.
గతంలోనే ఏఐసీడీ అమర్చిన పేషెంట్..
తీవ్రమైన హృద్రోగ సమస్యతో బాధపడుతున్న రోగికి గతంలోనే ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ (ఏఐసిడి) అమర్చబడింది. అయితే గుండె వైఫల్యం, వెంట్రిక్యులర్ టాకికార్డియో తదితర అనారోగ్య సమస్యలతో రోగి పలుమార్లు ఐసీయూలో వైద్య చికిత్స పొందుతూ వచ్చారు. ఆక్సిజన్ మద్దతు, మిల్రినోన్ థెరపీ సహా సమగ్రమైన వైద్య నిర్వహణ ఉన్నప్పటికీ రోగిలో అనారోగ్య లక్షణాలు కొనసాగాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అతినిద్ర తదితర లక్షణాలతో రోగి ఆరోగ్యం క్షీణతకు దారితీసింది. ఈ క్రమంలో రోగి కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ నగేష్ మరియు వారి బృందాన్ని సంప్రదించారు. దీంతో ఆమె ఆరోగ్యం పై పూర్తిస్థాయి పరిశీలన చేసిన వైద్యులు.. ఆమె జీవన మనుగడను మెరుగుపరిచేందుకు గుండె మార్పిడి మాత్రమే ఉత్తమమైనదిగా నిర్ధారించారు. దీంతో రోగి జీవన్ దాన్ లో నమోదు చేయబడ్డారు. ఐదు నెలల నిరీక్షణ అనంతరం అవసరమైన గుండె అందుబాటులోకి వచ్చింది.
సర్జన్ డా. నగేష్ ఆధ్వర్యంలో..
దాత గుండె ఆసుపత్రికి చేరుకున్న అనంతరం వైద్యులు గుండె మార్పిడికి ఉపక్రమించారు. కేర్ ఆస్పత్రి సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డా. నగేష్ నేతృత్వంలో కార్డియోథొరాసిక్ వైద్య నిపుణులు, అనస్థీషియా వైద్య నిపుణుల బృందం కలిసి రోగికి గుండె మార్పిడి ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. నగేష్ మాట్లాడుతూ, రోగి యొక్క గుండె వైఫల్యం, పునరావృత అరిథ్మియా వల్ల ఈ కేసు వైద్యులకు సవాల్ గా మారిందన్నారు. గుండె మార్పిడి రోగికి కొత్త జీవితాన్ని అందించిందన్నారు.
జీవన ప్రమాణం పెరగటం ఖాయం..
ఈ ప్రక్రియలో పాల్గొన్న వైద్య బృందం సమన్వయం, నైపుణ్యాన్ని ప్రశంసించారు. రోగి త్వరితంగా కోలుకున్నారని, భవిష్యత్తులో ఆమె జీవన ప్రమాణం మరింత మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రోగికి శస్త్ర చికిత్స అనంతరం తలెత్తే అన్ని రకాలైన అనారోగ్య సమస్యలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని చెప్పారు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, గుండె మార్పిడి ప్రక్రియ పూర్తిగా విజయవంతమైందని వెల్లడించారు. రోగి త్వరితగతిన కోలుకోవడంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది సహకారం పూర్తిస్థాయిలో అందిందన్నారు.
2 వారాల తరువాత డిస్చార్జ్ కూడా..
కేర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. అజిత్ సింగ్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే రోగులకు అధునాతన ఆరోగ్య సంరక్షణ విధానాలను అందించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. వైద్య బృందం నైపుణ్యం, అంకితభావానికి ఇది నిదర్శనం అన్నారు. రోగి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుంటామని వెల్లడించారు. కాగా గుండె మార్పిడి అనంతరం రెండు వారాల తర్వాత పూర్తిస్థాయి ఆరోగ్యవంతమైన స్థితిలో రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.