Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Opposition Unity: ఐక్యత కోసం అన్వేషణ

Opposition Unity: ఐక్యత కోసం అన్వేషణ

ఆశయం ఉన్నప్పటికీ ఆచరణకు అది ఆమడ దూరం ఉండడంతో ఒక విధమైన అయోమయ స్థితి నెలకొని ఉంది. బీజేపీయేతర పక్షాలన్నీ ఒక్క తాటి మీద నిలబడితే తప్ప రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దించే అవకాశం లేదని ప్రతిపక్షాలన్నిటికీ తెలిసిన విషయమే. అయితే, ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించడం ఎలా? ఏ పార్టీ ముందడుగు వేయాలి? ఏ పార్టీ చొరవ తీసు కోవాలి? ఏ విధంగా ప్రయత్నించాలి? పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ప్రతిపక్షాల ముందున్న ప్రధాన ప్రశ్నలివి. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం వేట మొదలైంది. ఈ విషయంలో ఏ పార్టీ బయటపడకపోయినా, ప్రతిపక్షాల ఏకాభిప్రాయం మాత్రం అదే. ప్రతిపక్షాల ఐక్యత ఓ ఎండమావిగా కనిపిస్తోంది. బీహార్‌ ముఖ్య మంత్రి నితీశ్‌ కుమార్‌, రాహుల్‌ గాంధీతో సహా కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ప్రతిపక్షాల ఐక్యత గురించి, ప్రస్తుత పరిస్థితుల్లో దాని అవసరం గురించి ప్రస్తావించారు కానీ, ప్రయత్న లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు గనుక చేతులు కలిపితే బీజేపీ ఓట్ల సంఖ్య, సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఖాయమని నితీశ్‌ కుమార్‌ ఈ మధ్య స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చొరవ తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.
అయితే, ఈ విషయంలో కాంగ్రెస్‌ ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. బీహార్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాలలో మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్షాలు ముందుగా పొత్తులు కుదర్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర శాసన సభలకు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్ర స్థాయి పొత్తుల విజయాలను బట్టి, అను భవాలను బట్టి జాతీయ స్థాయిలో పొత్తు కుదర్చుకునే విషయం ఆలోచించాలని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. మొదటగా జాతీయ స్థాయిలోనే బీజేపీయేతర ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో అనేక చిక్కులు, సమస్యలున్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అర్థం చేసుకుంది. నిజానికి, జాతీయ స్థాయిలో ఐక్యత సాధించాలన్న ఉద్దేశంతో ఉన్న కొన్ని ప్రతిపక్షాలు రాష్ట్ర స్థాయిలో బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తుం డడం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ ద్వైదీభావం, ఈ వైరుధ్యం ప్రతి పక్షాలకు నచ్చవచ్చేమో కానీ, ప్రజలకు మాత్రం నచ్చని విషయంగా కనిపిస్తోంది. పైగా, బీజేపీ దీనినొక అవకాశంగా తీసుకుని రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. త్రిపురలో ప్రాణ స్నేహితులుగా ఉన్న కాంగ్రెస్‌, వామపక్షాలు, కేరళలో బద్ధ శత్రువులనే విషయాన్ని ఇటీవల త్రిపురలో ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
అంతేకాదు, బీజేపీకి వ్యతిరేకమని చెప్పుకుంటున్న కొన్ని ప్రతిపక్షాలు ఈ విషయంలో చిత్తశుద్ధితో, నిజాయతీతో వ్యవహరించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇక ప్రతిపక్షాలలోనే కొన్ని పార్టీలు ఫ్రంట్‌ నాయకత్వం కోసం ప్రయ త్నిస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఫ్రంట్‌ ఆశయానికి ఇది గొడ్డలిపెట్టు. జేపీని ఓడించాలన్న ప్రధానాశయం దీనివల్ల బలహీనపడుతోంది. ఏ పార్టీ ఎన్ని సీట్లు సంపాదించుకుంటుం దనే దానిని బట్టి నాయకత్వం అనేది నిర్ణయం అయితే సమంజసంగా ఉంటుంది. కానీ, ప్రతిసారీ ప్రతిపక్షాల కంటే బీజేపీ ఒక అడుగు ముందే ఉంటోంది. ఏదైనా పార్టీ గరిష్ఠ స్థాయిలో లేదా అత్యధిక సంఖ్యలో సీట్లు సంపాదించి గద్దెనెక్కినప్పుడు మిగిలిన మిత్రపక్షాలను ఏ విధంగా దూరం పెడు తోందో బీజేపీ తరచూ గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతిపక్షాలలో ఏ పార్టీ అయినా అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పుడు ముందుగా ఐక్యతకు తిలోదకాలిస్తుందని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఒకవేళ ఏ పార్టీకీ మెజారిటీ లభించని పక్షంలో కిచిడీ పార్టీల పాలన సుస్థిరంగా ఉండడం సాధ్యం కాదని ప్రచారం చేస్తూ బీజేపీ ప్రతి పక్షాల ఐక్యతకు గండి కొడుతోంది. నిజానికి విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఐక్యత పేరుతో పొత్తులు పెట్టుకోవడమన్నది బీజేపీకి ఒక విధంగా ఉపయోగ కరంగా, లబ్ధిదాయకంగా ఉంటుందన్న విషయం కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో వెల్లడైంది.
ఏది ఏమైనా, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ఐక్యతా ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాలలో జరగబోయే శాసనసభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆలస్యం చేసే కొద్దీ బీజేపీకి ప్రజానుకూలత పెరిగే సూచనలున్నాయి. కాంగ్రెస్‌ ఆశిస్తున్నట్టు ముందుగా రాష్ట్ర స్థాయిలో పొత్తులు ఏర్పడితే జాతీయ స్థాయిలో పొత్తు ఏర్పడ డానికి భవిష్యత్తులో ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆలస్యం అయితే, ఐక్యత వెనుక పట్టు పట్టడం ఖాయం. శాసనసభల ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల సమయం తక్కువగా ఉంది. తొందరపడడం మంచిది. ఆలసించిన ఆశాభంగం!
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News