హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. మొత్తం 50 సాధించిన కమలనాథులు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించారు. హర్యానాలో కాంగ్రెస్ 34ే స్థానాలకు పరిమితం అయింది. హర్యానాలో ప్రాంతీయ పార్టీ అయిన ఐ.ఎన్.ఎల్.డి. కేవలం రెండంటే రెండు స్థానాలకే పరిమితం కావటం మరో హైలైట్. దీంతో ఈ పార్టీకి ప్రజలు ఇక రాజకీయ సమాధి కట్టినట్టైంది. మరోవైపు కేజ్రీవాల్ హోం స్టేట్ అయిన హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు.
గెలిచిన వినేష్ ఫోగట్..
హర్యానాలో జులన్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఒలింపిక్ ఛాంపియన్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. మరోవైపు తమ పార్టీ సడన్ గా వెనకంజలోకి వెళ్లి బీజేపీ లీడ్ లోకి రావటంపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
కేక్ వాక్ లా బీజేపీ హ్యాట్రిక్..
జాట్సేతర సామాజిక వర్గం ఓట్లన్నీ గంపగుంత్తగా బీజేపీ ఆకట్టుకోగలగటంతో ఈ హ్యాట్రిక్ సాధ్యమైంది. కాంగ్రెస్ వస్తే మళ్లీ జాట్స్ ఆధిపత్యం భరించలేమనే ఆగ్రహాన్ని ఎన్నికల ప్రచార సమయంలో పలు సామాజికవర్గ ఓటర్లు బాహాటంగానే పేర్కొన్నారు. ఇదే బీజేపీకి అస్త్రంగా మారినట్టు, పైగా కాంగ్రెస్ పార్టీ జాట్స్ సామాజిక వర్గంను ఆకట్టుకోవటంలో మునిగిపోవటం బీజేపీకి కలిసివచ్చేలా చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతోపాటు, సీఎం ఎవరనే రచ్చ చివరి వరకు సాగటం కాషాయపార్టీకి రాజకీయ లబ్ది చేకూర్చి కేక్ వాక్ లా హ్యాట్రిక్ సాధ్యమైందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.