Tuesday, October 8, 2024
HomeతెలంగాణMinister Jupally says Telangana state is the best state to invest: ...

Minister Jupally says Telangana state is the best state to invest: పెట్టుబ‌డులు పెట్ట‌డానికి తెలంగాణ అనువైన రాష్ట్రం

పర్యాటకుల, పెట్టుబడుల‌ గమ్యస్థానంగా..

సీయం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు.. ఘనమైన తెలంగాణ‌ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనతో ముందుకెళుతున్నట్లు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ఱారావు అన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని రూపొందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణకు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించ‌డం, పర్యాటకుల, ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా తెలంగాణ‌ను ఆవిష్కరించడమే ల‌క్ష్యంగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.. లాస్ ఎంజెల్స్ లోని డబుల్ ట్రీ హోటల్‌లో నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రవాస భారతీయులు (NRIs), విదేశీ ప్ర‌తినిధులు, ప‌ర్యాట‌కులు, అక్క‌డి అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

- Advertisement -

సంప్రదాయం, ఆధునికత రెండింటి క‌ల‌బోత తెలంగాణ అని అభివ‌ర్ణించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాలు, వార‌స‌త్వ‌ సంపద, సహజమైన ప్రకృతి అందాలు, కనువిందు చేసే జలపాతాలు, న‌దులు, సెలయేర్లు, దేవాలయాలు, తెలంగాణ జాన‌ప‌ద క‌ళ‌లు, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, బతుకమ్మ పండుగ గొప్ప‌త‌నం, పెట్టుబడుల అవకాశాలను మంత్రి హైలైట్ చేశారు. రాష్ట్ర ప్రజల సాంస్కృతిక జీవన విధానాలు, ఆతిథ్య సంప్రదాయాలు, ఆహార‌పు అల‌వాట్లు, పండుగలు పర్యాటకుల మనసులను దోచుకుంటాయ‌ని, కొత్త ప్రదేశాలను చుట్టేసి, కొత్త అనుభూతులు, సరికొత్త అనుభవాలు పోగేసుకోవాల‌ని అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌కు తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానం ప‌లికారు.

అలాగే పర్యాటకంతో పాటు తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడుల అవకాశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం దేశంలో మినీ ఇండియా గా ప్రసిద్ధి పొందిందని, ఆ నగరం ప్రపంచ స్థాయి ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఎదిగిందని పేర్కొన్నారు.

ఫ్యూచ‌ర్ సిటీ (భవిష్యత్తు నగరం) ప్రాజెక్ట్ గురించి పరిచయం చేస్తూ, ఈ ప్రాజెక్ట్ ద్వారా IT, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో అద్భుతమైన పెట్టుబడులు కల్పించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడిదారుల ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. ప్రకాష్ రెడ్డి, సాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా కాన్సుల్ జనరల్ చిట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News