నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయంలో శ్రీ శారదీయ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తొమ్మిదో రోజున అమ్మవారిని కాళరాత్రి దేవిగా అలంకరించారు. ఉదయాన్నే పూజలు నిర్వహించి కిచిడి నైవేద్యంగా సమర్పించారు. కాగా ఇదే రోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రావటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు పలు పొరుగు రాష్ట్రాల భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. తెల్లవారుఝాము నుంచే అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆలయ ఈ ఓ విజయ రామారావు నేతృత్వంలో చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలను ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల నేతృత్వంలో ఏ ఎస్పీ అవినాష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కార్యక్రమాలకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామని నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. శ్రీ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్ర సందర్భంగా బుధవారం తెల్లవారు జామున జరిగే మహా అక్షరాభ్యాస భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అక్షరాభ్యాసం కోసం రాష్ట్రం నలుమూలలనుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారని పేర్కొన్నారు. వారి మనోభావాలను గౌరవిస్తూ వారికి దర్శనం త్వరగా చూడాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో జేబు దొంగతనాలు, ఆభరణాల దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, నిరంతరం సీసీటీవీ లను కంట్రోల్ రూంలో సిబ్బంది పర్యవేక్షిస్తారన్నారు.
అనంతరం ఆలయ సిబ్బందితో కలసి క్యూ లైన్ ఏర్పాట్లు, పార్కింగ్, గోదావరిలో స్నానాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించారని ఆలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.