Wednesday, October 9, 2024
HomeతెలంగాణCM Revanth orders to community survey in 60 days: 60 రోజుల్లో...

CM Revanth orders to community survey in 60 days: 60 రోజుల్లో బీసీ సామాజిక‌, ఆర్థిక కుల స‌ర్వే పూర్తి చేయాలి

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై..

సుప్రీంకోర్టు తీర్పున‌కు అనుగుణంగా ఎస్సీ కులాల వ‌ర్గీక‌ర‌ణ అమ‌లుకు ఏక‌స‌భ్య న్యాయ కమిషన్ నియామ‌కం వెంట‌నే చేప‌ట్ట‌డంతో పాటు 60 రోజుల్లోనే క‌మిష‌న్ నివేదిక స‌మ‌ర్పించేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఏక‌స‌భ్య న్యాయ క‌మిష‌న్ నివేదిక స‌మ‌ర్పించిన అనంత‌రం దానికి అనుగుణంగా రాష్ట్రంలో నూత‌న నోటిఫికేష‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు, బీసీ సామాజిక‌, ఆర్థిక కుల స‌ర్వేపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై త‌మ‌కు అందిన విన‌తులు, పంజాబ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో వ‌ర్గీక‌ర‌ణ అమ‌ల‌వుతున్న తీరు, హ‌ర్యానాలో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సంబంధించిన మంత్రివ‌ర్గ ఉప సంఘంలోని సభ్యులైన మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, శ్రీ‌ధ‌ర్‌బాబు, సీత‌క్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్ స‌మావేశంలో వివ‌రించారు. ఎటువంటి న్యాయ‌పర‌మైన ఇబ్బందులు ఎదుర‌వ‌కుండా హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తితో క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ క‌మిష‌న్ 60 రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని గ‌డువు నిర్దేశించారు.

- Advertisement -

ఎస్సీ జ‌నాభా లెక్క‌ల‌కు సంబంధించి 2011 జ‌నాభా లెక్క‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఏక స‌భ్య క‌మిష‌న్‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సీఎస్‌ను అంద‌జేశారు. రాష్ట్రంలో వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు, కులాల రీగ్రూపింగ్‌కు సంబంధించి ఇప్ప‌టికే మంత్రివ‌ర్గ ఉప సంఘానికి అందిన విన‌తుల‌పైనా స‌మావేశంలో విశ్లేషించారు. వాట‌న్నింటిని ఏక స‌భ్య క‌మిష‌న్‌కు అంద‌జేయాల‌ని నిర్ణ‌యించారు. ఏక స‌భ్య న్యాయ కమిషన్ క్షేత్ర స్థాయి నుంచి విజ్ఞ‌ప్తులు, ఫిర్యాదులు స్వీక‌రించేందుకు వీలుగా ఉమ్మ‌డి ప‌ది జిల్లాల్లో ఒక్కో రోజు ప‌ర్య‌టించేందుకు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

  • త‌క్ష‌ణ‌మే రంగంలోకి దిగండి….

తెలంగాణ‌లో బీసీ సామాజిక‌, ఆర్థిక, కుల స‌ర్వే ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ సామాజిక‌, ఆర్థిక కుల స‌ర్వేపై బిహార్‌, క‌ర్ణాట‌క‌తో పాటు ప‌లు రాష్ట్రాలు అనుస‌రించిన విధానాల‌ను అధికారులు వివ‌రించారు. బీసీ సామాజిక‌, ఆర్థిక కుల స‌ర్వే చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన యంత్రాంగం త‌మ వ‌ద్ద లేనందున‌, రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ నిరంజ‌న్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ విజ్ఞ‌ప్తి మేర‌కు రాష్ట్ర ప్ర‌ణాళిక విభాగాన్ని అందుకు కేటాయిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ క‌మిష‌న్‌కు.. రాష్ట్ర ప్ర‌ణాళిక విభాగానికి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఓ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిని నియ‌మించాల‌ని సీఎం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని ఆదేశించారు. 60 రోజుల్లోనే సామాజిక‌, ఆర్థిక స‌ర్వే పూర్తి చేయాల‌ని డిసెంబ‌రు 9లోపే నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ స‌ర్వే పూర్త‌యితే వెంట‌నే స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లకు వెళ్లొచ్చ‌ని సీఎం అన్నారు.


స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ సుద‌ర్శ‌న్ రెడ్డి, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి రెండ్ల తిరుప‌తి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు మాణిక్ రాజ్‌, షాన‌వాజ్ ఖాసీం, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News