సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయాలు కలిగితే సహించబోనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మిషన్ భగీరథ అధికార సిబ్బందిని హెచ్చరించారు. దసరా సందర్భంగా ప్రజలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. తనకు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి జడ్చర్ల పట్టణం నుంచి కూడా మిషన్ భగీరథ నీటి సరఫరా విషయంగా ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. కేవలం సాంకేతిక కారణాలతోనే కాకుండా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కూడా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదనే ఫిర్యాదులు కూడా తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. బాలానగర్ మండల కేంద్రంలో ప్రజలకు కాకుండా ఒక కంపెనీకి నీటిని సరఫరా చేయడానికే అధిక ప్రాధాన్యతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పండుగల పైట కూడా ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి రాకుండా చూడాలని కోరారు. నీటి సరఫరా మెరుగుదల కోసం ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందించేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో మిషన్ భగీరథకు చెందిన ఎఇఇలతో పాటుగా ఇఇ వెంకటరెడ్డి హాజరయ్యారు.