Sunday, October 6, 2024
HomeతెలంగాణKCR: దగ్గరైన నిజామాబాద్-నిర్మల్, తగ్గిన 93km దూరం

KCR: దగ్గరైన నిజామాబాద్-నిర్మల్, తగ్గిన 93km దూరం

ఉమ్మెడ-పంచగూడ వారధి రెడీ అయింది. ఈ వంతెనతో నిజామాబాద్-నిర్మల్ జిల్లాల దూరం చెరిగి మరింత చేరువయ్యాయి. 93 కిలో మీటర్ల దూరం తగ్గి అప్పటి ఆదిలాబాద్ నుంచి కొత్తగా ఆవిర్భవించిన ఇప్పటి నిర్మల్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ జిల్లా ప్రజలు నిమిషాల వ్యవధిలోనే రాకపోకలు సాగిస్తున్నారు.

- Advertisement -

నందిపేటకు కొత్త వైభవం

ఉమ్మెడ-పంచగూడ వంతెన నిర్మాణం వల్ల నందిపేట్ మండలానికి కొత్త వైభవం వచ్చింది. ఇరు జిల్లాల ప్రజల రాకపోకలకు నందిపేట్ కేంద్ర బిందువుగా మారింది. దీనితో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అంతకు ముందు రూ. 3 లక్షలు కూడా లేని ఒక ఎకరం భూమి ఈ వంతెన నిర్మాణం తరువాత రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం పనులు పూర్తి చేసి కొత్తగా 20 కొత్త బస్సు సర్వీసులు నడిపేందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి యత్నిస్తున్నారు. పెరిగిన జన సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని నందిపేట్ లో బస్సు డిపో ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అతి సమీపంలో ఉన్న చారిత్రక ఉమా మహేశ్వర ఆలయం ఈ వంతెన వల్ల గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లనుంది.
నిర్వాసితులకు 3 కోట్ల పరిహారం
ఉమ్మెడ-పంచగూడ వంతెన భూ నిర్వాసితులకు ప్రభుత్వం 3,62,00,264 రూపాయలను పరిహారంగా అందజేసింది. ఈ వంతెన నిర్మాణం కోసం నందిపేట్ మండలం ఉమ్మెడ, సీహెచ్ కొండూరు, లక్కంపల్లి, బజార్ కొత్తూర్, చింరాజ్ పల్లి గ్రామాలకు చెందిన రైతులు భూములిచ్చారు. వారికి ఇప్పటికే పరిహారం చెక్కులు అందాయి.

షాక్ అయిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరగడానికి ముందు ఒక రోజు కేసీఆర్ గారు తమ బంధువుల ఇంటికి వెళుతూ నందిపేట్ మండలంలోని ఉమ్మెడ గ్రామం వద్ద గోదావరి నదిని తీక్షణంగా చూస్తూ అలాగే నిల్చుండి పోయారు. ఆ సమయంలో ఉమ్మెడ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పంచగూడ గ్రామానికి వెళ్ళడానికి షార్ట్ కట్ మార్గం లేని పరిస్థితుల్లో చిన్న పిల్లల నుంచి మహిళలు, వృద్ధుల వరకు పుట్టిపై అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు గోదావరిలో ప్రయాణిస్తూ తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్న దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. గతంలో గోదావరి ప్రవాహంలో పుట్టి మునిగి ఎందరో అమాయకులు ప్రాణాలు నీటిపాలైన అనేక ఘటనలు ఆయన మదిలో మెదిలాయి. అలాగే పోచంపాడ్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి నది విస్తరించి నీళ్ల నిల్వలు పెరగడంతో అటు వైపు, ఇటు వైపు రాకపోకలు స్తంభించాయి. దీంతో ఆర్మూర్, నిర్మల్ మీదుగా, లేదా బాసర, బైంసా మీదుగా లోకేశ్వరం, ముధోల్ మండలాలకు రాకపోకలు సాగించే వారు. దాదాపు70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఉమ్మెడ-పంచగూడ వంతెన నిర్మాణంతో నందిపేట్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంతోనే రాకపోకలు సాగుతున్నాయి. ఈ విషయం విని చలించి పోయిన కేసీఆర్ గారు వెంటనే ఆయన అసలు కృష్ణా నదిపై ఎన్ని వంతెనలు ఉన్నాయి, గోదావరి నదిపై ఎన్ని వంతెనలు ఉన్నాయనే అంశంపై ఆరాతీశారు. కృష్ణా నదిపై 22 వంతెనలు ఉన్నాయని, గోదావరి నదిపై రెండంటే రెండే వంతెనలు ఉన్నాయని తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తన మనసులో పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చాక, తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే వంతెన నిర్మాణానికి రూ.120కోట్ల నిధులిచ్చి ఉమ్మెడ- పంచగూడ వంతెన నిర్మాణం పూర్తి చేయగా అది ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధంమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News