Wednesday, October 16, 2024
HomeతెలంగాణJadcharla: చివరి గింజ వరకు వరి కొంటాం

Jadcharla: చివరి గింజ వరకు వరి కొంటాం

భరోసా..

అభివృద్ధి అంటే ఏమిటో రెండేళ్లలో చేసి చూపిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యంలో చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో నియోజకవర్గానికి నిధులను తీసుకువస్తున్నామని, తాము చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రతిపక్ష నాయకులు అడ్డుకోవాలని చూస్తే ఇకపై సహించబోమని హెచ్చరించారు.

- Advertisement -

జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ పెద్ద చెరువులో బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 60 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వదిలారు. అదే గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ వరి పండించే రైతులు దళారుల చేతుల్లో మోసపోయి తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకోకూడదని, ప్రభుత్వం మహిళ సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ ఏడాది సన్నధాన్యం క్వింటాల్ కు రూ . 2320 లతోపాటు రూ. 500 బోనస్, దొడ్డు ధాన్యానికి రూ. 2300 ధర చెల్లిస్తోందని తెలిపారు. గత ఏడాదిలో జడ్చర్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ. 36.33 కోట్ల విలువైన ధాన్యాన్ని కొలుగోలు చేసిందని, ఈ ఏడాది కూడా ధాన్యం కొనుగోలుకు 40కుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వం ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకాలు సక్రమంగా ఉంటాయని, ఎంఎస్పి ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తారని, అందుకు రైతులందరూ ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఇప్పటికే గడచిన 11 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి పథకాలను, నిధులను తాను నియోజకవర్గానికి తీసుకు వచ్చానని, ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో అధ్వాన్నంగా మారిన రోడ్లను అభివృద్ధి చేయడానికి గత పదేళ్ల కాలంలో ఎన్నడూ రానంత ఎక్కువగా నిధులను తీసుకువచ్చామని గుర్తు చేశారు. అయితే కొందరు బిఆర్ఎస్ నాయకులు తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి పనులను ఇకపై సహించబోమని, అభివృద్ధికి అడ్డు పడేవారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని కోరారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో ఉన్న 386 చిన్నా, పెద్దా చెరువులు, కుంటల్లోకి ఈ ఏడాది కూడా 24.72 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం వేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో నస్రుల్లాబాద్, మిడ్జిల్ చెరువులు రెండు పెద్దవి కాగా ఈ ఏడాది వీటిలోకి 90 వేల చేప పిల్లలను వేయడం జరుగుతోందని తెలిపారు. చిన్న చెరువులు, నీటి కుంటల్లో 23.82 లక్షల బంగారుతీగ రకానికి చెందిన చేప పిల్లలను వేయడం జరుగుతోందని అన్నారు. మత్స్య కార్మికులు చెరువులు, కుంటల్లోని చేపలను సంరక్షించుకోవాలని, మత్స్య కార్మికుల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నస్రుల్లాబాద్ చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడానికి, చెరువు కట్ట మరమత్తుకు చర్యలు తీసుకుంటామని, దీనికి ఈ ఏడాది బడ్జెట్ లోనే నిధులను తీసుకువస్తామని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. నస్రుల్లాబాద్ కు 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు అయిందని, దాని నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించే పనిని త్వరగా పూర్తి చేసి విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

పత్తి కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ తంగెళ్ల జ్యోతి, మత్య్యశాఖ సహాయ సంచాలకులు రాధా రోహిణి, తహసిల్దార్ బ్రహ్మం గౌడ్, ఎంపిడీఓ విజయ్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ గౌడ్, ఏఈఓ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సునీత, ఐకెపి ఎపిఎం మాల్యా నాయక్, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News