Friday, October 18, 2024
Homeఓపన్ పేజ్World Food Day: ఆహార సంక్షోభం రానుందా ?

World Food Day: ఆహార సంక్షోభం రానుందా ?

గ్లోబల్ వార్మింగ్ తో ఇంకా..

ఆహార సంక్షోభం రూపంలో మానవాళికి పెనుముప్పు పొంచి ఉంది. ప్రపంచ జనాభా ప్రతి ఏడాది ఇబ్బడిమబ్బడిగా పెరుగుతోంది. అయితే అనేక దేశాల్లో పెరుగుతున్న జనాభాకు సరిపడ ఆహారం దొరకడంలేదు. మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఆహారభద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనికి గ్లోబల్‌ వార్మింగ్‌ సహా అనేక కారణాలున్నాయి. ప్రకృతి వనరులను మానవాళి వినియోగించుకుంటున్న తీరు మారాల్సిన అవసరం ఉంది. లేదంటే మరో పాతికేళ్లలో తిండి గింజలకు కటకట ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆహారరంగ నిపుణులు.

- Advertisement -

అక్టోబరు 16న ప్రపంచ ఆహార దినోత్సవం

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబరు 16 తేదీన జరుపుకుంటారు. 1945 సంవత్సరం అక్టోబరు 16 న ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థను స్థాపించింది. ఇందుకు గుర్తుగా అక్టోబరు 16 తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి 1981 లో జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించిన ఒక్కో సందేశాన్నిస్తున్నారు. ఇదిలా ఉంటే భారతదేశంలో, ఆహార భద్రత అనేది చాలా మంది ఎదుర్కొంటున్న నిజమైన సమస్య. కాగా ప్రతి ఏటా 1300 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. అందులో చాలా వరకూ వ్యర్థాల కుప్పగా పోగుపడుతూ వాతావరణ మార్పుకూ ఒక కారణమవుతోంది. మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఆహార వృధా ఒకటి.. అంటున్నారు సైంటిస్టులు. అయితే భూగోళం మీదున్న అన్ని దేశాలూ ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలో 82 కోట్ల మందికి పైగా ప్రజలకు తగినంత ఆహారం లభించటం లేదు.ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఆహారంలో మూడో వంతు ఆహారం వృథా అవుతుందన్నది ఒక అంచనా.

భూమ్మీద మానవాళికి ఉన్న వనరులు పరిమితం. అందులోనూ సాగుభూమి మరీ పరిమితం. ప్రపంచవ్యాప్తంగా ఏ పంట అయినా వేసుకోగల లభ్యత కేవలం 140 కోట్ల హెక్టార్లు. అంటే సాగునీటి లభ్యత 140 కోట్ల హెక్టార్లకే పరిమితం అన్నమాట. సాగువిస్తీర్ణం సంగతి ఇలా ఉంటే ప్రపంచ జనాభా ఏడాదికేడాది పెరుగుతోంది. 2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందన్నది ఒక అంచనా. ఇదే జరిగితే ప్రపంచం ఆహార సంక్షోభం ఎదుర్కోవడం ఖాయమంటున్నారు నిపుణులు. వెయ్యి కోట్ల జనాభా రెండుపూటలా భోజనం చేయాలంటే తిండిగింజలు సరిపోవని హెచ్చరిస్తున్నారు. వెయ్యి కోట్ల జనాభా రెండుపూటలా తినాలంటే 2017తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పండించాలంటున్నారు నిపుణులు. అయితే అదంత సులభం కాదంటున్నారు ఆహారరంగ నిపుణులు. ప్రపంచ జనాభాకు తగ్గట్టు తిండిగింజలు పండించాలంటే సాగు విస్తీర్ణానికి ఉన్న పరిమితులు ప్రధాన అడ్డంకిగా మారాయంటున్నారు నిపుణులు. భారతదేశం మౌలికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం. నూటికి డెబ్భయిమందికి పైగా ఇప్పటికీ వ్యవసాయంపైనే జీవనం గడుపుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. అయితే కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో వ్యవసాయరంగ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. మనదేశంలో వ్యవసాయం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. వ్యవసాయానికి నీటి వసతి అతి ముఖ్యం. రుతుపవానాలు, భూగర్భజలాలు ఇవన్నీ నీటి యాజమాన్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. సేద్యానికి మంచి పోషకాలున్న నేల అవసరం. భూసారం బావుండాలి. సారవంతమైన నేలలోనే పంట దిగుబడులు బావుంటాయి. నేలలో అనేక జీవక్రియలు జరగడానికి అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మనదేశంలో వ్యవసాయానికి యోగ్యమైన నేలకు కొరత లేదు. అయితే ఈ నేలలో 40 శాతం ఇప్పటికే దెబ్బతిన్నది. అంటే 40 శాతం నేల నిస్సారంగా మారిందన్నమాట. దీనికి అనేక కారణాలున్నాయి. అశాస్త్రీయమైన వ్యవసాయ విధానాలే దీనికి ప్రధాన కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. నేలను పదేపదే ఉపయోగించడం వల్ల అందులోని సారం తగ్గిపోతుందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. నేలలో సేంద్రీయత ఎంత ఎక్కువగా ఉంటే సేద్యానికి అంత మంచింది. భూమిలో సేంద్రీయత కనీసం నాలుగు లేదా మూడు శాతం ఉండాలంటున్నారు సైంటిస్టులు. అయితే మనదేశంలోని అనేక ప్రాంతాల్లో సేంద్రీయత కేవలం 0.2 శాతం మాత్రమే ఉంటోంది. ఇంత తక్కువ సేంద్రీయత ఉండటం వ్యవసాయానికి ఏమాత్రం మంచిది కాదన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతేకాదు పంట దిగుబడిపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు. తక్కువ సేంద్రీయత ఉన్న భూముల్లో సేద్యం చేయడం వల్ల పంటల దిగుబడి విపరీతంగా తగ్గుతుందన్నారు. అలాగే పోషకవిలువలు కూడా తక్కువగా ఉంటాయన్నారు సైంటిస్టులు. భూసారాన్ని కాపాడుకోకపోవడమే భారతదేశ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అంటున్నారు శాస్త్రవేత్తలు. వానలు, వరదలు వచ్చినప్పుడు భూసారం కొట్టకుపోతుందని వివరించారు. భూసారం ఒకసారి తగ్గితే మళ్లీ పెంచుకోవడం అంత సులభం కాదంటున్నారు వ్యవసాయరంగ నిపుణులు. ఒక ప్రాంతంలో నేల 2.5 సెంటీమీటర్ల మందంలో సారవంతంగా మారడానికి 500 సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. మొత్తంమీద సారంలేని మట్టితో అన్నీ అనర్థాలే అంటున్నారు సైంటిస్టులు.
వాతావరణంలో తీవ్ర మార్పులు !
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా కాస్తంత ఎక్కువగా మరికాస్త తక్కువగా కూడా ఉండేది. ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా టెంపరేచర్లు ఎడాపెడా పెరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు సైంటిస్టులు. ఈ పరిణామం అంతిమంగా ప్రపంచానికి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోందంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పులకు గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌ హౌజ్‌ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. దీని ఫలితంగా, వాతావరణం మనం ఊహించనంతగా వేడెక్కుతోంది. ఫలితంగా ఎండలు మండిపోతున్నాయి. భూగోళం చరిత్రలో గత పాతికేళ్లనుంచి అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులే భవిష్యత్తులోనూ కొనసాగితే ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్నది ఒక అంచనా. ఈ పెరుగుదల మూడు నుంచి ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్‌లు కూడా ఉండొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంటోంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే, గ్లోబల్‌ వార్మింగ్‌ సంభవిస్తోంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పచ్చటి ప్రదేశాలు కాలక్రమంలో ఎడారులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.
పంటల దిగుబడిపై మార్పుల ప్రభావం !
వాతావరణ మార్పుల ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడుతోంది. ఫలితంగా ఆహార భద్రత ఒక సవాల్‌ గా మారుతోంది. అంతిమంగా తిండి గింజల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా రావచ్చు అని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు అనేక దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు. మనదేశంలో ఆకలి మరణాలు లేవు కానీ పోషకాహార లోపం సమస్య ఉంది. మరో పదేళ్లకు గోధుమలు, మొక్కజొన్న వంటి పంటల దిగుబడులు కొంత మేర తగ్గవచ్చన్నది ఒక అంచనా. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పోషకాహార లోపం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. చివరకు ఈ ప్రభావం చిన్నారులపై పడటం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో పోషకాహార లోపం అనే అంశం తెరమీదకు రాబోతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక సంయుక్త కార్యాచరణకు సిద్ధం కావాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదిలాఉంటే మనదేశంలో వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో చాలా మంది రైతులు వలస బాట పడుతున్నారు. కట్టుకున్న ఊరిని, కన్నవాళ్లను వదలివేసి పిల్లా పాపలతో వలసలు పోతున్నారు. తట్టాబుట్టా సర్దుకుని సమీపానగల పట్టణాలకు తరలిపోతున్నారు. పట్టణాల్లో ఎక్కువగా భవన నిర్మాణ కూలీలుగా మారుతున్నారు. లేదంటే చిన్నా చితకా పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కొన్నిసార్లు పట్టణాల్లో కూడా పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.

-ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ 63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News