జపాన్ లో అణు బాంబు పేలుడు ఘటనలో బతికి బట్టకట్టిన వారితో ఏర్పడిన నిహోన్ హిదంక్యో అనే సంస్థకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం ప్రపంచానికి అణ్వాయుధ ప్రమాదం ఏ స్థాయిలో ఉండబోతున్నదీ గుర్తు చేసింది. ఈ శాంతికాముక సంస్థకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కా రాన్ని ప్రకటించడం ప్రతీకాత్మక విషయమే తప్ప అగ్ర రాజ్యాల మీదా, ప్రపంచ దేశాల నాయకుల మీదా దీని ప్రభావం ఉంటుందని ఆశించడానికి ఏమీ లేదు. వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతల మీద పోరాటాలు
సాగిస్తున్నట్టే ప్రపంచ దేశాల్లో శాంతి స్థాపన కోసం పోరాటాలు సాగించాల్సి ఉంటుందని ఇది గుర్తు చేస్తోంది. అణు బాంబు పేలుళ్లు 1945 సంవత్సరానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇటువంటిది ఇప్పుడు కూడా ఎప్పుడైనా, ఎక్కడైనా జరగవచ్చు. నిజానికి 1962లో క్యూబా క్షిపణి సంక్షోభం సందర్భంగా అణ్వాయుధాల్ని ఉపయోగించే సూచనలు కనిపించాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా తరచూ అణ్వాయుధాల ప్రయోగం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమెరికా, చైనాలు పోటాపోటీగా తమ అణ్వాయుధ పాటవాన్ని విస్తరించుకుంటూ పోతున్నాయి. అణ్వస్త్రాలను ప్రయోగించడానికి అవకాశాలు, సందర్భాలు పెరుగుతుండడంతో అనేక దేశాలకు ఇది ఆందోళనకర విషయంగా మారింది. ఈ నేపథ్యంలో నిహోన్ హిదంక్యోకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అణ్వాయుధాలను ప్రయోగించడమే కాదు, దగ్గర ఉంచుకోవడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ శాంతి కాముక సంస్థ చాలా ఏళ్లుగా పోరాటాలు సాగిస్తోంది. అణ్వస్త్రాల వల్ల తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం జరగడంతో పాటు, ప్రజలు తీవ్రస్థాయిలో అనారోగ్యాలకు గురికావడం, జీవచ్ఛవాలుగా మారడం, అనేక తరాల పాటు దీని ప్రభావం ప్రజల మీద పడడం వగైరాలను కూడా ఈ సంస్థ అగ్రరాజ్యాలతో పాటు, ఇతర ప్రపంచ దేశాలకు గుర్తు చేస్తోంది. 1945లో హిరోషిమా, నాగసాగిల మీద అణు బాంబులతో అమెరికా దాడిచేసినప్పుడు, ప్రాణాలతో మిగిలినవారు హిబకుషా పేరుతో సంఘటితమయ్యారు. వారికి ప్రస్తుతం నిహోన్ హిదంక్యో ప్రాతినిధ్యం వహిస్తోంది. అంటే, అణు బాంబు దాడుల వల్ల ప్రత్యక్షంగా దెబ్బతిన్నవారికి ఈ సంస్థ ప్రాతినిధ్యం వహించడం జరుగుతోందన్న మాట. అప్పట్లో ఆ బాంబు దాడులకు రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక వేలాది మంది పౌరులు తరతరాలుగా అనారోగ్యాలపాలవుతూనే ఉన్నారు. అనారోగ్యాల పాలయినవారి అనుభవాలతో పాటు, వినతులు, విజ్ఞప్తులు, ప్రాతినిధ్యాలు వగైరాలను ఈ సంస్థ ఐక్యరాజ్య సమితికి, ప్రపంచంలోని శాంతి సంఘాలకు, ప్రపంచ నాయకులకు పంపించడం జరుగుతుంటుంది. అణు నిరాయుధీకరణ అవసరాన్ని ఇది ప్రపంచ దేశాలకు ఈ విధంగా వివరించి చెబుతూ ఉంటుంది. మానవాళి, అణ్యస్త్రాలు సహజీవనం చేయడం సాధ్యపడదనే విషయాన్ని తాము ప్రపంచానికి తెలియజేయదలిచామని నోబెల్ పురస్కార కమిటీ ప్రకటించింది.
అణ్వస్త్రాల విషయంలోనే కాకుండా ఇతర ఆయుధాల ప్రయోగానికి వ్యతిరేకంగా కూడా అనేక శాంతి సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారాలు జరగవలసి ఉంది. అయితే, ఇటువంటి ప్రచారాలు, పోరాటాల ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం (CTBT) తదితర అంతర్జాతీయ ఒప్పందాలు ఆశించిన స్థాయిలో అమలు జరుగుతున్న సూచనలు కూడా కనిపించడం లేదు. అణ్వస్త్రాలకు సంబంధించిన ఆందోళనలకు నిహోన్ హిదంక్యో పుల్ స్టాప్ పెడుతుందని ఆశించలేం కానీ, వాటి వల్ల ప్రపంచానికి ఎదురయ్యే ముప్పును మాత్రం ఇది ప్రపంచానికి మరోసారి చాటి చెబుతోంది. అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా అక్కడక్కడా, అప్పుడప్పుడూ సాగుతున్న పోరాటాలు, ప్రచారాలకు ఇది నైతిక బలం ఇచ్చే అవకాశం కూడా ఉంది.