బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్(SalmanKhan)కు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్‌ను చంపకుండా ఉండాలంటే రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నెంబర్‌కు వార్నింగ్ మెసేజ్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల సల్మాన్ సన్నిహితుడు బాంద్రా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్ నడిరోడ్డుపై హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్‌కు ఎవరు సహాయం చేసినా వారికి ఇదే గతి పడుతుందని ఆ గ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే హెచ్చరించింది.
తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్‌కు ఉన్న వైరం ముగియాలంటే రూ.5కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ పోలీసులకు వార్నింగ్ మెసేజ్ చేశారు. ఆ మెసేజ్‌లో ఏముందంటే.. ‘సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా రూ.5కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బెదింపులను తేలిగ్గా తీసుకోవద్దు’ అని హెచ్చరించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో పాటు బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా సల్మాన్‌ఖాన్‌కు ఇదే తొలి బెదిరింపు కాదు. ఇంతకుముందు కూడా అనేక సార్లు చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించారు. దీంతో సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసుల భద్రతను పెంచింది. మొత్తానికి మరోసారి చంపేస్తామని బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.