తనపై ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala ramakrishna reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసును క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 25 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా.. పోలీసులు LOC ఇవ్వటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని మరో పిటిషన్ వేశారు. అయితే సజ్జల దాఖలు చేసిన ఈ రెండు పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. విదేశాల నుంచి వస్తున్న సజ్జలను ఢిల్లీ విమానశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ కేసులో మంగళగిరి పోలీసులు గురువారం మధ్యాహ్నం రెండు గంటల పాటు ఆయనను విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో సరైన సమాధానాలు చెప్పలేదని పోలీసులు తెలిపగా.. కూటమి ప్రభుత్వం తనతో పాటు వైసీపీ నేతలను టార్గెట్ చేసిందని.. పోలీస్ కేసులు పెట్టి తమను భయపెట్టాలని చూస్తోందని సజ్జల మండిపడ్డారు.
ఇక ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టై జైలుకు వెళ్లిన విషయం విధితమే. ఆయనతో పాటు మరికొంత మంది కార్యకర్తలు కూడా జైలు పాలయ్యారు. అయితే ఇతర నిందితులగా పేర్కొన్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాశ్‌లు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు ద్వారా అరెస్ట్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును మంగళగిరి పోలీసుల నుంచి సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.