Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Chandrababu: టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

- Advertisement -

టీడీపీ ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు(CHANDRABABU) గట్టి వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు. నాయకుడికి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పట్టినా.. అదే విశ్వసనీయత పోవడానికి ఒక్క నిమిషం చాలు అన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతో శ్రమించారని.. త్యాగాలు చేశారని గుర్తుచేశారు. కక్షసాధింపు చర్యలకు దిగితే వైసీపీకి మనకి తేడా లేదని ప్రజలు అనుకుంటారని తెలిపారు. ఏ కార్యకర్త తప్పు చేసినా సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్‌ ఉంటుందని పేర్కొన్నారు.

వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది..

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కలిపి మొత్తం నాలుగు సార్లు సీఎంగా పనిచేశానని, కానీ ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐదేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్వాకం వలనే బడుమేరు పొంగి విజయవాడకు వరదలు వచ్చాయని మండిపడ్డారు. వరద బాధితులకు సాయం కోసం కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. 2029లోనూ గెలుపు కోసం మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీ కీలకపాత్ర..

ప్రస్తుతం జాతీయ స్థాయిలో భాగస్వామ్యంగా ఉన్నామని, మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. అధికారం కోసం కాకుండా దేశం, ప్రజల కోసం పాటు పడిందని పేర్కొన్నారు. పదవులు తీసుకోకుండానే నాటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కొనసాగామని గుర్తు చేశారు. ప్రస్తుతం టీడీపీ శక్తిమంతమైన పార్టీగా ఆవిర్భవించిందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకువచ్చే నిధులు సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని సూచించారు.

ప్రధాని నుంచి నేర్చుకోవాలి..

చండీగఢ్‌లో హర్యాణా సీఎం ప్రమాణస్వీకారం తర్వాత జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ 5 గంటల పాటు అక్కడ కూర్చున్నారని కొనియాడారు. ఆయన అంతసేపు అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నారు. అయినా కానీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అందుకే మోదీ నుంచి మనం చాలా నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆయన పట్టుదల, కృషి వల్లే మూడోసారి ప్రధాని అయ్యారని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News