IND vs NZ | బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతమైన ఆట తీరుతో ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే కేవలం 110 బంతుల్లోనే 100 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఇది తన అంతర్జాయతీ కెరీర్‌లో తొలి సెంచరీ కావడం విశేషం. ఓవర్‌నైట్ 70 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సర్ఫరాజ్ ఏదశలోనూ తడబాటుకు గురికాలేదు. చూడచక్కని షాట్లతో టీ20 తరహాలో ఫోర్లు, సిక్సర్లు బాదాడు. అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఒత్తిడితో కూడిన రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో సర్ఫరాజ్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు రిషబ్ పంత్ కూడా తన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే అర్థసెంచరీతో రాణించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 344/3 పరుగులుగా ఉంది. సర్ఫరాజ్ (125), పంత్ (52)పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో టీమిండియా కేవలం 12 పరుగుల వెనుకంజలో మాత్రమే ఉంది. అయితే వాన పడటంతో ఆటకు బ్రేక్ పడింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో కివీస్ జట్టుకు 356 పరుగుల ఆధిక్యం లభించింది. ఇవాళ్టితో పాటు మరో రోజు ఆట మిగిలి ఉండటంతో రోహిత్ సేన కివీస్ జట్టు ముందు భారీ టార్గెట్ పెట్టాలనే పట్టుదలతో ఉంది.
IND vs NZ | ఇక చావో రేవో తేల్చుకోవాల్సి సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అర్థసెంచరీలతో సత్తా చాటారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అయితే ఆట ముగిసే సమయంలో కోహ్లీ అవుట్ కావడం అభిమానులను నిరాశపర్చింది.