SI RUDE BEHAVIOUR | అధికారం ఉందనే అహంకారం.. పోలీస్ అయితే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే పొగరు.. వెరసి కొందరి పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఓవైపు పోలీస్ ఉన్నతాధికారులు తమది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రగల్భాలు పలుకుతుంటే.. మరోవైపు ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్న బాధితుల పట్ల అవమానవీయ రీతిలో ప్రవర్తిస్తున్నారు కొందరు పోలీస్ అధికారులు. తాజాగా ఇటువంటి దారుణ ఘటనే తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని ముగ్గురు యువకులు స్థానికంగా ఉండే పెట్రోల్ బంక్ సిబ్బందితో ఘర్షణ పడ్డారు. దీంతో బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన ఎస్సై జగన్.. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విచారిస్తుండగా ఓ యువకుడు ఎస్సై ముందు తల దువ్వుకున్నాడు. దీంతో తన ముందే తల దువ్వుకుంటువా అంటూ ఆగ్రహంతో రగిలిపోయిన ఎస్సై ఆ ముగ్గురు యువకుకు శిరోముండనం చేయించారు.
అయితే అందరి ముందు తనకు శిరోముండనం చేయించండంతో ఘోర అవమానంగా భావించిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై అతడి బంధువులు నిరసనకు దిగారు. శిరోముండనం చేయించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్సై తీరును మందలించినట్లు తెలుస్తోంది.