Bandi Sanjay| తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రంగా విరుచుకుపడ్డారు. గ్రూప్1 పరీక్ష వాయిదా వేయాలంటూ హైదరాబాద్ అశోక్‌నగర్‌లో అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు బండి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ దోస్తీ చేసేది నిజం కాదా అని ప్రశ్నించారు. చీకట్లో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కేసీఆర్(KCR) డబ్బుల సంచులు అప్పగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు కూడా డబ్బు మూటలు పంపారని ఆరోపించారు.
తనకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో దోస్తీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థిత దాపురించిందని విమర్శించారు. ఆ బాధ భరించలేకనే కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌కు దోస్తీ లేకుండానే ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరం కేసులు అటకెక్కాయా? అని నిలదీశారు. ఆ కేసులు నుంచి బయటపడేందుకే చీకట్లో కేసీఆర్ సంచుల పంపిణీ చేశారని.. లేదంటే కేసీఆర్ బ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు.
కాగా అంతకుముందు ముఖ్యమంత్రి సీటు నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులే కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా, గ్రూప్- 1 విషయంలో సీఎం రేవంత్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోతారని బండి హెచ్చరించడంపై కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బండి సంజయ్ తపిస్తున్నారని.. అసలు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా..? బీజేపీ అనుబంధ ప్రభుత్వమా..? కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై బండి పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.