Sunday, October 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Amaravati: ఏపీ ప్రజలకు శుభవార్త.. అమరావతికి ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంటే..!

Amaravati: ఏపీ ప్రజలకు శుభవార్త.. అమరావతికి ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంటే..!

Amaravati| ఏపీ ప్రజలకు మరో శుభవార్త అందింది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అప్పునా..? రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాలా..? అనే సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సందేహాలకు ప్రపంచబ్యాంక్ చెక్ పెట్టింది. అమరావతి నిర్మాణానికి ఇవ్వనున్న రూ.15వేల కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనుంది. అంటే ఆ మొత్తంలో దాదాపు రూ.13,440 కోట్లు ప్రపంచబ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ADB) నుంచి కేంద్ర ఆర్థికశాఖ రుణంగా తీసుకుని సీఆర్‌డీఏ(CRDA)కి ఇవ్వనుంది. అమరావతి కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం పేరుతో ఆ రెండు బ్యాంకులు చెరో 80 కోట్ల డాలర్ల చొప్పున రుణం ఇస్తున్నాయి.

- Advertisement -

రుణ గ్రహీతగా కేంద్ర ఆర్థికశాఖ..

ఈ రూ.15వేల కోట్లలో బ్యాంకులు ఇచ్చేది మినహా మిగతా మొత్తాన్ని కేంద్రం సమకూరుస్తుంది. బ్యాంకులకు రుణాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాల్ని ప్రపంచ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో కేంద్ర ఆర్థికశాఖను రుణ గ్రహీతగా, సీఆర్‌డీఏను ప్రాజెక్టు అమలు ఏజెన్సీగా పేర్కొంది. ‘ప్రొగ్రామ్‌ ఫర్‌ రిజల్ట్స్‌ ఫైనాన్సింగ్‌’ విధానంలో రుణం సమకూరుస్తున్నట్లు తెలిపింది. ఈ లెక్కన చూసుకుంటే రూ.15 వేల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో రాజధాని నిర్మాణానికి సమకూర్చిన రూ.15 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి గ్రాంట్‌గానే వస్తోందని స్పష్టమైంది. ఇది నిజంగా రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్తగానే పరిగణించాలి.

శరవేగంగా అమరావతి నిర్మాణం..

ఇదిలా ఉంటే అమరావతి పనులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ముగిశాయి. డిసెంబర్ కల్లా హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఉన్నతాధికారుల భవనాలు, తదిరత భవనాల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు చకచకా జరగనున్నాయి. రెండు, మూడు సంవత్సరాల్లో ఈ నిర్మాణాలు పూర్తిచేయడంతో పాటు అన్ని రకాల మౌలిక వసలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణాలను పున:ప్రారంభించారు. ఉద్దండరాయునిపాలెంలో నిర్మిస్తున్న ఏడు అంతస్తుల సీఆర్‌డీఏ భవనం నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించారు. దీంతో రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News