Blast In Delhi| దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్(CRPF) స్కూల్ బౌండరీ వాల్ వద్ద పేలుడు శబ్ధం వినిపించింది. ఈ పేలుడు జరిగిన వెంటనే అక్కడ పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు, దుకాణాల అద్దాలు కూడా పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పేలుడుకు గల కారణాలకు తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పేలుడుకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించామని డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఈ పేలుడు ఎలా జరిగింది.. ఇది అసలు ఎలాంటి పేలుడు అనే దానిపై స్పష్టత లేదన్నారు. ఈ ఘటనపై నిపుణుల బృందం సమగ్ర విచారణ చేస్తోందని త్వరలోనే పేలుడుకు గల కారణం డీసీపీ తెలిపారు. CRPF పాఠశాల గోడ చుట్టూ కొన్ని దుకాణాలు ఉడంటంతో ఆ షాపుల్లోని సిలిండర్ ఏమైనా పేలి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ పేలుడు ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.