YS JAGAN| వైఎస్సార్ జిల్లా బద్వేల్లో ఇంటర్ విద్యార్థిని ప్రేమోన్మాది హత్యాచారం చేసిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ ‘లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు..? మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదో చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యంకూడా ఉంది’ అని విమర్శించారు.
‘చంద్రబాబు మీరు వైయస్సార్‌సీపీ మీద కక్ష కొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజలమీద కక్ష సాధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా? వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? “దిశ’’ యాప్‌లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూంకు, అక్కడనుంచి దగ్గర్లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరు గార్చలేదా?అని ప్రశ్నించారు.
‘దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 “దిశ’’ పోలీస్‌స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు..? మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు గారు…? అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
మరోవైపు ఇదే ఘటనపై మాజీ మంత్రి రోజా(ROJA) కూడా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గుండె పగిలేలా రోదిస్తున్న బాధితురాలి కన్నతల్లి గర్భశోకం మీ చెవులకు వినిపిస్తుందా..? చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణలేదు.. వరుస మానభంగాలు, హత్యలతో ఆంధ్రప్రదేశ్‌ను.. ఆత్యాచారాంధ్రప్రదేశ్‌గా మార్చేసిన కూటమి ప్రభుత్వం’ అంటూ మండిపడ్డారు. కాగా శనివారం బద్వేల్‌లో ఇంటర్ చదివే విద్యార్థిని ప్రేమ పేరుతో ఓ యువకుడు హత్యాచారం చేశాడు. ఈ ఘటనపై సీరియన్ అయిన సీఎం చంద్రబాబు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.