Sunday, October 20, 2024
Homeచిత్ర ప్రభUnstoppable 4 With NBK: బాలయ్య టాక్‌ షో షూటింగ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు

Unstoppable 4 With NBK: బాలయ్య టాక్‌ షో షూటింగ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు

Balakrishna-Chandrbabu| వెండితెర మీదే కాదు బుల్లితెరపై కూడా ‘అన్‌స్టాపబుల్’ అంటున్నారు నందమూరి అందగాడు, నటసింహం బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే(Unstoppable with NBK)షో’ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుని దుమ్మురేపింది. అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీజన్‌ 4 స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో గత సీజన్ల కంటే మించి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అందుకు తగ్గట్లే గెస్టులను సెలెక్ట్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి తొలి ఎపిసోడ్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chadrababu) ముఖ్య అతిథిగా కనిపించనున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌‌ షూట్‌ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. షూటింగ్ కోసం సెట్‌కు వచ్చిన చంద్రబాబుకు బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ టాక్ షో నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నందమూరి, టీడీపీ అభిమానులు ఈసారి బావ,బామ్మర్దుల దెబ్బకు బుల్లితెర రికార్డులు బద్దలు కావాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆహాలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ టాక్‌ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. గతంలో స్ట్రీమింగ్ అయిన ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 3’లోనూ ఆయన పాల్గొన్నారు. ఇందులో తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ కొత్త సీజన్ కోసం వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, ‘కంగువా’ చిత్ర బృందం, ఏపీ మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖులు సందడి చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. హ్యాట్రిక్ హిట్లతో మాంఛి జోరు మీదున్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇదే కాకుండా ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో ‘అఖండ2’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. మొత్తానికి వరుస సినిమాలతో ఇటు వెండితెరపై.. అన్‌స్టాపబుల్ టాక్ షోతో అటు బుల్లితెరపై బాలయ్య దుమ్మురేపుతున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News