Sunday, November 24, 2024
Homeఇంటర్నేషనల్Elon Musk: ఈవీఎంలపై ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు

Elon Musk: ఈవీఎంలపై ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు

Elon Musk| ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎం(EVM)లు సురక్షితం కాదని బాంబు పేల్చారు. అందుకే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానం ఉపయోగించాలని సూచించారు. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో మస్క్ ఈవీఎంలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేయొచ్చని ఆరోపించారు. పెన్సిల్వేనియాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌(DONALD TRUMP) ఎన్నికల ప్రచారంలో మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంలను రిగ్గింగ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

- Advertisement -

ఓటింగ్ యంత్రాలను అమెరికాలోని ఫిలడెల్ఫియా, మారికోపా కౌంటీలలో ఉపయోగిస్తున్నారని.. అయితే ఇతర ప్రదేశాలలో ఉపయోగించడం లేదని తెలిపారు. కచ్చితంగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను మాత్రమే ఉపయోగించాలని.. పోలింగ్ అనంతరం వాటిని చేతితోనే లెక్కించాలని డిమాండ్ చేశారు. “నేను సాంకేతిక నిపుణుడిని. నాకు కంప్యూటర్ల గురించి బాగా తెలుసు. నేను కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను విశ్వసించను. ఎందుకంటే దానిని హ్యాక్ చేయడం చాలా సులభం. పేపర్ బ్యాలెట్ విషయంలో అలా హ్యాక్ చేసే అవకాశం లేదు. ప్రజాస్వామ్య దేశాలలో పేపర్ బ్యాలెట్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి” అని మస్క్ అభిప్రాయపడ్డారు.

కాగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలన్ మస్క్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించేందుకు రాజకీయ కార్యాచరణ కమిటీకి 75 మిలియన్ డాలర్లు విరాళంగా కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలపైనా గతంలో మస్క్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా భారత్‌లో ఈవీఎంలు ఉపయోగించరాదని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News