Monday, October 21, 2024
HomeతెలంగాణGroup 1: గ్రూప్1 పరీక్షలు వాయిదా వేయలేం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Group 1: గ్రూప్1 పరీక్షలు వాయిదా వేయలేం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Group 1| తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల రీషెడ్యూల్, జీవో29 రద్దుపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు వెళ్లారని ఇలాంటి సమయంలో వాయిదా వేయడం కుదరదని తేల్చిచెప్పింది. అలాగే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం నిరాకరించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై హైకోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలీని రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. అలాగే తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయన్న హైకోర్టు వ్యాఖ్యలను కోట్ చేసింది.

- Advertisement -

కాగా గ్రూప్1 మెయిన్స్ పరీక్షల రీషెడ్యూల్, జీవో 29రద్దు చేయాలని కొంతకాలంగా అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపడంతో ఆందోళన ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయగా.. సింగిల్ బెంచ్ ధర్మాసనం నిరాకరించింది. అనంతరం ఈ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. అయితే నోటిఫికేషన్‌ రద్దు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం.. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా పరీక్షల వాయిదాకు నిరాకరించింది.

మరోవైపు ఇప్పటికే అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మరికొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నేతలను కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో వారం రోజుల పాటు జరగనున్న ఈ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించేందుకు అధికారులు కూడా సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News