KICHCHA SUDEEP| కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తన తల్లి మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయిపోయారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘ఇన్నిరోజులూ మనిషి రూపంలో నా పక్కన తిరిగిన దేవత మా అమ్మ. నువ్వు నాకు మిగిల్చిన ఈ బాధను నేను చెప్పలేకపోతున్నాను అమ్మ. నా దగ్గర పదాలు లేవు. నువ్వు లేని ఈ జీవితం నాకు శూన్యంగా ఉంది. ఇప్పటికీ నువ్వు లేవు అనే విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఒక్కరోజులో..ఆమె నా గురువు. నా మొదటి అభిమాని. నేను ఎలా నటించినా ఇష్టపడేది. ఇప్పుడు ఆమె ఓ అందమైన జ్ఞాపకం మాత్రమే. కేవలం 24 గంటల్లో నా జీవితం అంతా మారిపోయింది.’ అని వాపోయారు.
‘నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఆమె లేదనే విషయాన్ని నేనింకా అంగీకరించలేకపోతున్నా. ఇకపై నాకు ‘గుడ్ మార్నింగ్ కన్నా’ అనే మెసేజ్ రాదు. శుక్రవారం చివరిసారి మెసేజ్ పెట్టింది. శనివారం బిగ్‌బాస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్ వచ్చింది. డాక్టర్లతో మాట్లాడి షో వేదికపైకి వెళ్లాను. మనసులో ఎంత బాధ ఉన్నా షూటింగ్ చేశా. షూటింగ్ అయిపోయాక ఆసుపత్రికి వెళ్లేసరికి ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమె స్పృహలో ఉన్నప్పుడు చూడలేకపోయాను. ఆదివారం ఉదయం ఆమె శాశ్వతంగా దూరమైంది. చూస్తుండగానే కొన్ని గంటల్లో అంతా మారిపోయింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నన్ను హత్తుకొని జాగ్రత్తలు చెప్పిన మా అమ్మ.. కొన్ని గంటల్లోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది..నీకు ఇప్పుడు శాంతి దొరికిందని నేను అనుకుంటున్నారు. బాగా రెస్ట్ తీసుకోమ్మ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అమ్మ’ అని సుదీప్ తన బాధను వ్యక్తం చేశారు.
మరోవైపు తన నాయనమ్మ అంత్యక్రియల్లో మీడియా వ్యవహరించిన తీరుపై శాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు. నాయనమ్మతో దిగిన ఫొటోను పంచుకున్న శాన్వీ ‘నాయనమ్మను కోల్పోయిన దుఃఖంలో ఉంటే.. కొందరు వ్యక్తులు నా మొహంపై కెమెరాలు పెట్టారు. బాధతో ఉన్న వ్యక్తిపై ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారని నాకు ఇప్పటి వరకు తెలియదు. వారి కారణంగా నేను నాయనమ్మకు సరైన సెండాఫ్ ఇవ్వలేకపోయాను. నాన్నతో కూడా వారు అలానే ప్రవర్తించారు. ఆయన ఏడుస్తుంటే జనాలు ఆయన్ని నెట్టేశారు. కొందరు ఆయన మీద పడి లాగడం మొదలుపెట్టారు. మరికొందరు ఆయన్ని ఫొటోలు తీశారు. వారికి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ మరొకరి భావోద్వేగాలను అర్థంచేసుకోవడంలో లేదు’ అంటూ మండిపడ్డారు.