Tuesday, October 22, 2024
HomeతెలంగాణMLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య

MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య

MLC Jeevan Reddy| తెలంగాణలో మరోసారి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లు నేడు రక్తపు మరకలతో స్వాగతం పలుకుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలే హత్యకు గురికావడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డిని(58) గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఇవాళ ఉదయం గ్రామంలో తన ద్విచక్రవాహనంపై వెళుతున్న గంగారెడ్డిని ప్రత్యర్థులు తొలుత కారుతో వెనుక నుండి ఢీ కొట్టి కింద పడగానే కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు గంగారెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

మృతుడు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. తన అనుచురుడి హత్య విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గంగారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. హత్యకు పాల్పడిన నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న గంగారెడ్డిని హత్య చేయడం అంటే.. తనను కూడా హత్య చేసినట్లే అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై నిరసన చేపట్టడంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంతో పాటు జగిత్యాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి పలుమార్లు విజయం సాధించారు. గతంలో వైఎస్సార్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో తన ప్రత్యర్థిని తనకు తెలియకుండా పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అలకబూనారు. అనంతరం కొంతమంది సీనియర్ నాయకులు ఆయనకు నచ్చజెప్పడంతో కాస్త వెనక్కుతగ్గారు. కాకపోతే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణమే నెలకొంది. ఎవరికీ వారే విడివిడిగా పార్టీ కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురికావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News