Friday, November 22, 2024
HomeతెలంగాణTSRTC: వేసవిలో ప్రయాణికులకు పకడ్బందీ ఏర్పాట్లు

TSRTC: వేసవిలో ప్రయాణికులకు పకడ్బందీ ఏర్పాట్లు

వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. బస్టాండ్‌ల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లు, కూలర్లు, బెంచిలను ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో ప్రయాణికులకు ఏర్పాట్లు, సంస్థలోని ఇతర అంశాలపై హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌ నుంచి ఆర్‌ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ ఆన్‌లైన్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే కాలం టీఎస్‌ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు అధికారులందరూ పూర్తిగా సన్నద్ధం కావాలన్నారు. సంస్థ ఆర్థిక పుష్టికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించడమే తమ ప్రధాన విధి అనే విషయం మరిచిపోవద్దని చెప్పారు.
మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు.
ముందస్తు రిజర్వేషన్‌కు రాయితీ కల్పిస్తున్నామన్నారు. 31-45 రోజుల ముందు రిజర్వేషన్‌ చేసుకుంటే 5 శాతం రాయితీ, 46-60 రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక రాయితీలను సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలని ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News